ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి

Argentina Legend Lionel Messi Announces Retirement from International Football

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్, నేటితరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించారు. రెండు దశాబ్దాలకు పైగా అర్జెంటీనా జట్టుకు సేవలందించిన మెస్సి, జాతీయ జట్టుతో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

మెస్సి తన అంతర్జాతీయ కెరీర్‌లో అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ సాధించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అర్జెంటీనా జట్టుకు నాయకత్వం వహిస్తూ 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పాటు 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లను అందించి దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

ప్రపంచకప్ ఓటమి తర్వాత ఊహాగానాలు

ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1-0 తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన తర్వాత మెస్సి అంతర్జాతీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతకాలం పాటు జాతీయ జట్టుకు ఆడాలని తొలుత భావించినప్పటికీ, రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని మెస్సి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

భావోద్వేగ ప్రకటన చేసిన మెస్సి

తన నిర్ణయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెస్సి, జాతీయ జట్టును వీడటం తనకు ఎంతో బాధ కలిగిస్తున్నప్పటికీ, ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు అర్జెంటీనా జట్టులోకి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

దాదాపు 20 ఏళ్లుగా తనపై ప్రేమాభిమానాలు చూపిన అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, జట్టు అధికారులు అందించిన సహకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ఇకపై అర్జెంటీనా జట్టుకు బయట నుంచి సాధారణ అభిమానిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పానిష్‌ భాషలో పోస్ట్ చేయడం విశేషం.

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ చరిత్రలో చిరస్థాయిగా మెస్సి ముద్ర

అర్జెంటీనా జాతీయ జట్టుతో మెస్సి సాధించిన విజయాలు, అభిమానులకు అందించిన మధుర క్షణాలు ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రపంచకప్, కోపా అమెరికా వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో జట్టును విజయపథంలో నడిపించిన మెస్సి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు కొత్త శకానికి నాంది పలికారు. ఆయన అంతర్జాతీయ రిటైర్మెంట్‌తో ఒక గొప్ప అధ్యాయం ముగిసినప్పటికీ, ఫుట్‌బాల్ ప్రపంచంపై మెస్సి ప్రభావం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.

అంతర్జాతీయ స్థాయిలోనూ మొనగాడే!

ఫుట్‌బాల్ ప్రపంచంలో పీలే, డీగో మారడోనా వంటి దిగ్గజాల తర్వాత అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా లియోనెల్ మెస్సీ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. క్రిస్టియానో రొనాల్డో వంటి సమకాలీన దిగ్గజాలతో పోటీ పడుతూ, తన అద్భుతమైన ఆటతీరుతో మెస్సీ ఫుట్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపించిన మెస్సీ, కీలక మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ప్రపంచకప్‌లో మెస్సీ మాయాజాలం

మెగా టోర్నీలో అల్జీరియాపై హ్యాట్రిక్, ఆస్ట్రియాపై రెండు గోల్స్‌తో మెస్సీ తన సత్తా చాటాడు. జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కొట్టిన ఫ్రీకిక్ గోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈజిప్ట్, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన కీలక పోరులో జట్టును విజయాల వైపు నడిపించిన తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. గోల్స్ చేయడమే కాకుండా సహచరులకు అవకాశాలు సృష్టించడంలోనూ మెస్సీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

సవాళ్లను జయించిన సాకర్ దిగ్గజం

నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిన మెస్సీ చిన్నతనంలో ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొన్నాడు. పొట్టిగా ఉన్నాడంటూ స్థానిక కోచ్‌లు అతడిని తిరస్కరించిన సందర్భాలూ ఉన్నాయి. చిన్న వయసులోనే ఎదుగుదలకు సంబంధించిన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అతడు తన లక్ష్యాన్ని వదల్లేదు.

మెస్సీ ఎదుగుదలలో బార్సిలోనా పాత్ర

మెస్సీ ప్రతిభను గుర్తించిన బార్సిలోనా క్లబ్ అతడికి అండగా నిలిచింది. అవసరమైన చికిత్సతో పాటు అత్యున్నత స్థాయి ఫుట్‌బాల్ శిక్షణ అందించింది. 2004లో బార్సిలోనా తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ, ఆ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌లో చెరగని ముద్ర వేశాడు. 2005లో అర్జెంటీనా జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన ఆయన, రెండు దశాబ్దాలకుపైగా దేశం కోసం ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, క్లబ్ ఫుట్‌బాల్‌లో మెస్సీ ఆటను అభిమానులు ఆస్వాదించే అవకాశం ఉంది. మైదానంలో మెస్సీ మెరుపులు తగ్గినా, ఫుట్‌బాల్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులు, అందించిన మధుర క్షణాలు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here