తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న సీఎం విజయ్.. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ‘‘అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత నేనే’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన విజయ్.. 1967, 1977, 1982, 2026 సంవత్సరాలను ప్రస్తావిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని గతంలోని ప్రముఖ నేతలతో పోల్చారు.
‘‘1967, 1977, 1982, 2026.. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్. ఈ వరుసలో ప్రస్తుతం విజయ్. ప్రజలంతా ఇలానే భావిస్తున్నారు. ప్రకృతితో పాటు ప్రజలు కూడా మాకు ఎల్లవేళలా అండగా ఉంటారు’’ అని విజయ్ వ్యాఖ్యానించారు.
మహిళలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
మహిళలను దూషించడం, వ్యక్తిగత దాడులకు దిగడం, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలతో మానసిక వేదనకు గురిచేయడం వంటి వాటిని సహించబోమని సీఎం విజయ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేసుకోవడంలో తప్పు లేదని.. అయితే మహిళలను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా 1989లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానాన్ని విజయ్ ప్రస్తావించారు. ఆ ఘటనను ‘చీకటి రోజు’గా అభివర్ణిస్తూ.. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.
ఇటీవల నటి త్రిషపై కొందరు చేసిన వ్యాఖ్యలను కూడా విజయ్ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని.. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
డీఎంకేపై విజయ్ తీవ్ర ఆరోపణలు
డీఎంకే పాలన అవినీతిమయంగా మారిందని విజయ్ ఆరోపించారు. గతంలో డీఎంకే అధ్యక్షుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి తన పదవిని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మేనల్లుడు మురసోలిమారన్.. వీరాణం టెండర్ల విషయంలో కాంట్రాక్టర్ల నుంచి 2.5 శాతం వరకు ముడుపులు వసూలు చేశారని ఆరోపించారు.
అయితే కరుణానిధిపై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని విజయ్ స్పష్టం చేశారు. అదే సమయంలో డీఎంకే రాజకీయ విధానాలు, అవినీతి ఆరోపణలను మాత్రం తీవ్రంగా విమర్శించారు.
‘డీఎంకే బూటకపు బ్రాండ్‌ను ధ్వంసం చేస్తా’
మాయమాటలతో ప్రజలను మోసగించిన డీఎంకే బూటకపు బ్రాండ్‌ను త్వరలోనే ధ్వంసం చేస్తానని విజయ్ శపథం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన 100 పేజీల నివేదికను ప్రస్తావిస్తూ.. పార్టీ ఫండ్ పేరుతో డీఎంకేలో వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
పార్టీ ఫండ్ పేరుతో జరిగిన వసూళ్ల ద్వారా మాజీ సీఎం స్టాలిన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి లబ్ధి పొందారని విజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని అన్నారు.
మొత్తంగా తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత తానేనంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తన స్థానాన్ని ఏ విధంగా చూస్తున్నారనే చర్చకు తెరలేపాయి.









































