తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 30) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ప్రతిపక్ష నేతగా మూడుసార్లు సిరిసిల్లలో పర్యటించిన ఆయన, సీఎంగా తొలిసారి అడుగుపెడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక యంత్రాంగం ఈ పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
రూ. 345.78 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు & శంకుస్థాపనలు:
-
నేతన్న బజార్ ప్రతిపాదన: సిరిసిల్లలోని చేనేత, పవర్లూమ్ కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు నూతనంగా ‘నేతన్న బజార్’ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
-
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
-
వేములవాడ ఆలయాభివృద్ధి: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సమగ్ర అభివృద్ధికి గాను రూ. 99.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 26 రకాల పనులకు భూమిపూజ నిర్వహిస్తారు.
-
పాలనా భవనాలు & గోదాములు: సిరిసిల్ల, వేములవాడల్లో ఆర్డీవో కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలతో పాటు రుద్రంగిలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ధాన్యపు గోదాముల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు.
-
శాంతి భద్రతలు & ఇందిరా మహిళా శక్తి: వేములవాడలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్, సిరిసిల్ల-వేములవాడల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు పెద్దూరులో నూతనంగా నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవన్’ను సీఎం ప్రారంభించనున్నారు.
రగుడు బైపాస్ వద్ద ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. చేనేత రంగానికి ఊతమిచ్చే సరికొత్త పథకాలు, పవర్ లూమ్ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన అంశాలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.








































