ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, సింగపూర్ హోం మంత్రి కె. షణ్ముగంతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఇరువురు మంత్రులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం సందర్భంగా లోకేశ్, షణ్ముగం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం తదితరాలను వారికి అందజేశారు.
తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సింగపూర్ మంత్రి షణ్ముగం పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో టీటీడీ చేసిన ఏర్పాట్లను ఆయన అభినందించారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన లోకేశ్, షణ్ముగం భక్తులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పలువురు చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.
సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో షణ్ముగం తిరుమల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న సింగపూర్ మంత్రికి లోకేశ్ స్వాగతం పలికారు.






































