కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.
2018లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాజకీయ వివాదం కొనసాగుతున్న సమయంలో రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేత మహేశ్ శ్రీశ్రీమల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. ముంబైలోని గిర్గావ్ మేజిస్ట్రేట్ కోర్టు 2019లో ఈ కేసులో విచారణ ప్రారంభించింది.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 8న ఆయన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అయితే, ఈ స్టే కేసులో తుది తీర్పు కాబోదు. కేవలం తాత్కాలిక మినహాయింపు మాత్రమే. రాహుల్ గాంధీ పిటిషన్పై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.







































