ఏపీ అభివృద్ధిపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖలు

Megastar Chiranjeevi Says, Visible Positive Change in AP's Development

ఆంధ్రప్రదేశ్‌లో పాలన మరియు మౌలిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలో ఉన్న జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, సూర్య హెల్త్‌కేర్ సెంటర్‌ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్‌ల్యాబ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తానూ ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చే సమయంలో రోడ్ల పరిస్థితి, పాలనా సంస్కరణల గురించి చర్చించుకున్నామని, గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో రహదారుల పరిస్థితి మెరుగైందని, పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా దేశంలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

ఆరోగ్య రక్షణ మరియు క్యాన్సర్ అవగాహనపై చిరంజీవి ప్రత్యేకంగా ప్రసంగిస్తూ, ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే దానిని సమర్థవంతంగా జయించవచ్చని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, ప్రకృతిసిద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.

వైద్య విద్యార్థులు నిరంతర అభ్యాసం, క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం మరింత బాగుపడుతోందని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతోందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలి మార్పుల వల్ల 40 ఏళ్ల లోపు యువతలో కూడా క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతుండటం ఆందోళనకరమని అన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండి, ఇంట్లో వండిన స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని హితవు చెప్పారు.

సినీనటుడు చిరంజీవి ఇప్పటికీ అంతే ఉత్సాహంతో, ఫిట్‌గా ఉండటానికి ఆయన పాటించే ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాలే కారణమని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జీఎస్‌ఎల్ ఛైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here