ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మరియు సమన్వయంపై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం నియోజకవర్గం రంపచోడవరం పరిధిలోని కాకవాడలో జరిగిన గ్రామసభలో ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన స్థానిక ఎన్నికల అంశంపై స్పష్టంగా మాట్లాడారు.
స్థానిక సమరంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు అందరూ పొత్తు ధర్మం ప్రకారమే బరిలో నిలుస్తారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ విజయం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ మరియు జనసైనికులు గతంలో అనేక త్యాగాలు చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అరెస్టు చేసిన క్లిష్ట పరిస్థితుల్లో, రోడ్లపైకి రావడానికి ఎవరూ సాహసించని సమయంలోనూ జనసైనికులు, వీరమహిళలు ముందుండి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.
అందువల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులకు, వీరమహిళలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వ సమన్వయం అత్యంత కీలకమని, ఇటు తెలుగుదేశం, అటు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులకు ఏ విధంగా అయితే గౌరవం ఇస్తారో.. జనసేన అభ్యర్థులకు కూడా అదే స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.
సాధారణ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగగా, రాబోయే స్థానిక ఎన్నికలు మాత్రం ప్రజల స్థానిక అవసరాల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం జరుగుతాయని తెలిపారు. కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వంద శాతం విజయాలు సాధించాలని, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.







































