మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఫైర్

AP BJP Chief PVN Madhav Slams CJP Over Its Association With Ex CM YS Jagan

వైస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డితో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కలిసి పనిచేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే సీజేపీ.. అవినీతి ఆరోపణలు, ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న జగన్‌తో చేతులు కలపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, రథాల దగ్ధం, విగ్రహాల ధ్వంసం, దేవాలయ ఆస్తుల ఆక్రమణలు, మత మార్పిడుల అంశాలు వివాదాస్పదంగా మారాయని మాధవ్ ఆరోపించారు. అప్పటి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో అస్థిరతకు కారణమయ్యే శక్తులతో జగన్ చేతులు కలుపుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని మాధవ్ పేర్కొన్నారు. అయితే రాళ్లదాడులు, పోలీసులపై దాడులు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, భద్రతా సిబ్బందిపై దాడులకు సమర్థన ఉండకూడదని అన్నారు. చట్టాన్ని అమలు చేసే పోలీసుల చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం మాజీ ముఖ్యమంత్రికి తగదని వ్యాఖ్యానించారు.

అవినీతి వ్యతిరేక నినాదాలకు, ఆచరణకు మధ్య సీజేపీ వైఖరిలో వైరుధ్యం కనిపిస్తోందని మాధవ్ విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్షాల హక్కులు, రాజకీయ స్వేచ్ఛకు ఎదురైన సవాళ్లను ప్రజలు మర్చిపోలేదన్నారు. జగన్ రాజకీయ ప్రయత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ తీర్పును వెల్లడిస్తారని ఎక్స్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here