ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ క్రమశిక్షణపై పలు సూచనలు చేశారు.
‘చెప్పాం.. చేస్తున్నాం’ నినాదంతో ప్రచారం
2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి అద్భుత విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొంటూ, ఈ అంశాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానికంగా నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, మిత్రపక్షాల మధ్య ఐక్యతను కాపాడాలని సూచించారు. ప్రజల్లో గుర్తింపు ఉన్న, గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్న అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
టికెట్ రాని వారికి భరోసా
పొత్తులు, సామాజిక సమీకరణాల కారణంగా కొందరికి పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో సాధించే ఫలితాలు పార్టీ నాయకత్వం, కార్యకర్తల పనితీరుకు పరీక్షగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.







































