ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం రూబీ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభింభించిన అనంతరం సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజారోగ్య రంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ విశ్వవిద్యాలయం వేలాది మంది నిపుణులైన వైద్యులను, సర్జన్లను దేశానికి అందించడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (AI) మరియు ఆధునిక రీసెర్చ్‌ను జోడించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా యువ వైద్యులు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
1986లో ప్రారంభమైన ప్రస్థానం
దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ 1986 నవంబర్ 1న ఏర్పాటైంది. వైద్య విద్యను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య నిపుణుల తయారీకి తోడ్పడటం దీని ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
వర్సిటీ విజయాలపై ప్రత్యేక సావనీర్
ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలో వైద్య, దంత, నర్సింగ్, ఫిజియోథెరపీతో పాటు ఆయుష్ విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో వర్సిటీ నాలుగు దశాబ్దాల ప్రయాణం, సాధించిన విజయాలు, వైద్య విద్యకు చేసిన సేవలను వివరించే ప్రత్యేక సావనీర్‌ను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో వైద్య విద్యలో నాణ్యతను పెంచడం, పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక బోధనా విధానాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాలని వర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది.







































