తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా తిరస్కరించింది. ఈ దశలో కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన తగిన కారణాలు లేవని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, విచారణ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌యే సహజమైన వేదిక అని స్పష్టం చేసింది.
మహారాష్ట్రకు చెందిన ‘మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్, కేసులో నిందితుడిగా ఉన్న మచ్ఛీంద్ర శాంతారామ్ లంకే ఈ బదిలీ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఇక పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో కేసు విచారణకు అనుకూలమైన, నిష్పక్షపాతమైన వాతావరణం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై వరుసగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే, ఈ వాదనలపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. “గతంలోనే మేము ఇచ్చిన ఆదేశాల ద్వారా అందరినీ మౌనంగా ఉండేలా చేశాం. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా ముందే తగిన ఆదేశాలు జారీ చేశాం. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే మళ్లీ మా వద్దకు రావచ్చు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
కేసులో మెజారిటీ సాక్షులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే కావడంతో పాటు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలోనే విచారణ కొనసాగుతున్నందున వేరే రాష్ట్రానికి మార్చడం సముచితం కాదని న్యాయస్థానం పేర్కొంది. తద్వారా పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తూ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల్లోనే కొనసాగుతుందని తీర్పునిచ్చింది.









































