సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటకు పైగా సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో ప్రగల్భాలు, వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే అంశాలు ఒక్కటీ లేవని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ తన గంట ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఇంకా నా పేరును 140 సార్లు తలచుకున్నారని.. బీఆర్ఎస్ అంటే ఆయనకెంత భయమనేది దీనిని బట్టే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీస్తూ, “సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?” అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎంత మొరిగినా ఆయన పని అయిపోయిందని, తెలంగాణ భవిష్యత్తు మళ్లీ బీఆర్‌ఎస్‌దేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని హరీశ్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో మంజూరై, పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 1,070 కోట్ల అభివృద్ధి పనుల గురించి గానీ, కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే చర్యల గురించి గానీ సీఎం ఎందుకు మాట్లాడలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలకు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే కేసీఆర్ హయాంలో అమలైన ఏ ఒక్క పథకాన్నీ నిలిపివేయలేదని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు.
పేద గర్భిణీలకు అండగా నిలిచిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెలు-చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, మన ఊరు-మన బడి, కంటి వెలుగు వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో ముఖ్యమంత్రి చేసిన ‘తాటిచెట్టు’ వ్యాఖ్యలు, బాడీ షేమింగ్ తీరుపైనా హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాటిచెట్టుకు బలమైన వేర్లు ఉంటాయని, ఎంతటి పెనుగాలులనైనా, తుపానులనైనా తట్టుకుని నిలబడుతుందని గుర్తుచేశారు. గౌడన్నల ఆర్థిక జీవనానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన తాటిచెట్టును కించపరిచేలా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల మార్పు గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ దేవుళ్లపై ఒట్లు వేసి రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.
అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ, మానవీయ కోణంలో వ్యవహరించడంలోనూ కేసీఆర్‌కు ఎవరూ సాటిరారని హరీశ్‌రావు పేర్కొన్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు కేసీఆర్ స్వయంగా ఆదుకుని అత్యుత్తమ వైద్యం చేయించారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి సభలు పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.







































