నీటి నాణ్యతకు సంబంధించి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) నుంచి నోటీసులు అందినట్లు వెలువడిన వార్తా కథనాలపై ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లెరీ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ మినరల్ వాటర్ పూర్తిగా సురక్షితమని, వినియోగదారులు ఎలాంటి సంకోచం లేకుండా బిస్లెరీ నీళ్లను తాగొచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
గోవాలో తయారైన బిస్లెరీ బాటిళ్లలో ఒక బ్యాచ్‌కు చెందిన నమూనాలను పరీక్షించగా అందులో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం, ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణకు సిద్ధమైన నేపథ్యంలో బిస్లెరీ ఈ వివరణ ఇచ్చింది.
ఈ వివాదంపై బిస్లెరీ స్పందిస్తూ, అసలు ఈ ఉదంతం సుమారు 14 నెలల క్రితం నాటిదని తెలిపింది. అప్పట్లో గోవా ప్లాంట్ నుండి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ సేకరించిన నమూనాల్లో మొదటి ఐదు శాంపిల్స్‌లో ఎలాంటి సమస్య లేదని, అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.
అయితే ఆరవ శాంపిల్‌లో మాత్రం బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు నివేదిక రావడంతో, తాము నిబంధనల ప్రకారం అప్పీల్ చేశామని తెలిపింది. అనంతరం రిఫరల్ ల్యాబ్‌లో మళ్లీ జరిపిన పరీక్షల్లో ఆ నమూనాకు క్లీన్‌చిట్ లభించిందని బిస్లెరీ స్పష్టం చేసింది.
నాణ్యత విషయంలో తాము ఎప్పుడూ అత్యంత కఠినమైన ప్రమాణాలను పాటిస్తామని బిస్లెరీ కంపెనీ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. తమ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసే క్రమంలో 10 వేర్వేరు దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే బాటిళ్లను మార్కెట్లోకి విక్రయానికి పంపుతామని వివరించింది.
దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని చూరగొన్న తమ సంస్థకు వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యమని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (FSSAI) చేపట్టే ప్రక్రియకు అన్ని రకాలుగా పూర్తి సహకారం అందిస్తామని బిస్లెరీ హామీ ఇచ్చింది.
తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటీసు అందనప్పటికీ, నిబంధనల ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకుంటూ విషయాన్ని పరిష్కరించుకుంటామని తెలిపింది. బిస్లెరీ ప్రకటనతో వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనలకు కొంతమేర తెరపడినట్లయింది.







































