సముద్ర రవాణా రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలను కోరుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియా ఫౌండేషన్ మరియు కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఏషియన్-ఇండియా మారిటైమ్ కాంక్లేవ్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విశాఖపట్నానికి ఎంతో ఘనమైన సముద్ర చరిత్ర ఉందని, తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి ఈ నగరం నిలయమని ఆయన గుర్తుచేశారు.
దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని ఒక మేజర్ మారిటైం మరియు ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరకును నిర్వహించి దాదాపు 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని నారా లోకేష్ వివరించారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం మరియు కాకినాడలలో 4 నూతన పోర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ పోర్టులు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఏపీ మరియు పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఎంతో తోడ్పాటునందిస్తాయని చెప్పారు.
అదనంగా దుగరాజపట్నంలో దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో మేజర్ షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, గత వారమే విశాఖలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, నౌకల మరమ్మతుల రంగాల్లో రూ.7,500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పోర్టులను పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నారా లోకేష్ కొనియాడారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
భారత నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.70,000 కోట్ల ప్యాకేజీకి (ఇందులో రూ.25,000 కోట్ల మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ సహా) ఆమోదం తెలిపిందన్నారు. భారత వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని, ప్రతి నూతన నౌకాశ్రయం పరిశ్రమలకు, వ్యాపారాలకు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







































