ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్పై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సోమవారం కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ‘మహాపాదయాత్ర’ నిర్వహించారు.
ఈ యాత్రకు నాయకత్వం వహించిన నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణపై తాము ఇచ్చిన వివరణకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కేవలం తన జేబులో పెట్టుకుని తిరుగుతారని, కానీ తాము రాజ్యాంగాన్ని హృదయాల్లో పెట్టుకుని గౌరవిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీపై నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, “రాహుల్ తరచూ ఓట్ చోరీ అని ఆరోపిస్తున్నారు.. అసలు ఓట్లు మాకే ఉన్నాయి, ఓట్ల చోరీ మీదే” అని కౌంటర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా చనిపోయిన 3 కోట్ల మంది ఓట్లు ఇంకా జాబితాలో ఉండాలా, అలాగే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న 6 కోట్ల మంది వలసదారులు మరియు అక్రమ చొరబాటుదారులకు ఓటు వేసే అవకాశం కల్పించాలా అని ఆయన ప్రశ్నించారు.
మన రాజ్యాంగం అక్రమ ఓట్లకు అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారత ఆర్థిక వ్యవస్థ ఆపదలో ఉందని మాట్లాడి దేశం పరువు తీస్తున్నారని, ఆయనకు దేశాభివృద్ధి పట్టదని, ఆయన బాధంతా తన కుటుంబ అభివృద్ధి గురించేనని నితిన్ నబీన్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం రాహుల్ గాంధీకి ఒక ఏటీఎంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక అవినీతి పాలనకు తెరదించి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే, ఇప్పుడు రాష్ట్రంలో అంతకుమించిన అవినీతి పాలన సాగుతోందని నితిన్ నబీన్ విమర్శించారు.
అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ లేదని విమర్శించే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్లో జరుగుతున్న ఈ మహాపాదయాత్రను కళ్లారా చూడాలని సవాల్ విసిరారు. నితిన్ నబీన్ నాయకత్వంలో బీజేపీ కొత్త పంథాలో పరుగులెత్తుతోందని, త్వరలోనే తెలంగాణలో బీజేపీ రాజ్యం, రామరాజ్యం, మోదీ రాజ్యం రావాలని ఆకాంక్షించారు.
చనిపోయిన వారి ఓట్లు తొలగించాలా వద్దా అని ప్రశ్నిస్తూ, ఎస్ఐఆర్ ప్రారంభమయ్యే వరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓటు కూడా జాబితాలో అలాగే ఉండిపోయిందని బండి సంజయ్ గుర్తుచేశారు. అనంతరం కరీంనగర్ గాంధీ చౌక్ నుంచి కమాన్ చౌరస్తా వరకు మహాపాదయాత్ర కోలాహలంగా కొనసాగింది.








































