హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద చేపట్టిన పనుల ప్రగతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు మే 2, శనివారం నాడు బుద్దభవన్ లో సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెఛ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమీషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి కేటిఆర్ సూచించారు. ఇది వర్కింగ్ సీజన్, ఒక నెలపాటు పనులు చేయవచ్చు, జూన్ నుండి వర్షాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి కేటిఆర్ తెలిపారు. దేశంలో లాక్డౌన్ ను చక్కగా వినియోగించుకున్న రాష్టంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించుకుందామని తెలిపారు. అందుకనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్ల లో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు.
జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు వుండాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్ల వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్ఆర్డిపి, లింక్, సర్వీస్ రోడ్లను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ఎండిఎ, ఇతర విభాగాలతో సమన్వయము చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్ డేట్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణంలో వున్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu