తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రక్రియలో కీలక ముందడుగు పడనుంది. వచ్చే జనవరి నెలలో మూసీ ఫేజ్-1 పనులను ప్రారంభించేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి మరియు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో.. ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే ఇందులో ఒక భాగానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.
మీరాలం చెరువు, గండిపేట గోశాల, కోహెడ మార్కెట్‌లకు డెడ్‌లైన్:
మీరాలం చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీయగా, 2028 జనవరి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. చెరువు సుందరీకరణతో పాటు అందులో ఎంతోకాలంగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించాలని సీఎం ఆదేశించారు. అలాగే రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
గండిపేట వద్ద నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనులను నాణ్యతలో రాజీ పడకుండా సమాంతరంగా రోడ్ల నిర్మాణంతో సహా పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ప్రణాళిక:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జి డిజైన్లను పరిశీలించిన సీఎం, దాని సమీపంలో మల్టీ లెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) ఫేజ్-1కు సంబంధించి కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు, అలాగే బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి బషీర్‌బాగ్, సెక్రటేరియట్ మీదుగా రాణిగంజ్ వరకు అలైన్‌మెంట్ ప్రతిపాదనలను అధికారులు వివరించారు.
నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలు మరియు మల్టీ లెవల్ పార్కింగ్ కోసం అనువైన స్థలాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
ఎస్టీపీల నిర్మాణాలు, మెట్ల బావుల పునరుద్ధరణపై దిశానిర్దేశం:
నగరంలోని చెరువుల పునరుద్ధరణ మరియు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పురోగతిని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ముఖ్యమంత్రికి వివరించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మురుగునీటి శుద్ధి కోసం అవసరమైన చోట సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనితో పాటు నగరంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




































