ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ ప్రత్యేక కార్యాచరణ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధివిధానాలను ప్రశ్నించినప్పుడు, వారు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారని గుర్తుచేశారు. ఈ కీలక సమావేశం ద్వారా రాష్ట్రంలో పారదర్శకమైన రాజకీయ విలువలను పెంపొందించడంతో పాటు, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడంలో జనసేన పార్టీ తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటిచెప్పింది.
ఎక్కడా తగ్గకండి.. మీ వెనుక రక్షణ కవచంలా నేనుంటా
రాజకీయాల్లో మరీ మౌనంగా ఉంటే దానిని చేతకానితనంగా చూస్తారని, అందుకే పార్టీ నాయకులు ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇటీవల జనసేన నేత పంతం నానాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాము సమర్థించబోమని చెప్తూనే.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపి నాయకులు మాట్లాడిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
“అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడి, ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైనా అదే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీలో ఎప్పటికి మార్పు వస్తుందో మేమూ చూస్తాం” అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్న కమిటీ సభ్యులకు ధైర్యం చెబుతూ.. “మీరు ముందుండి నడవండి, మీకు రక్షణ కవచంలా నేను వెనుకే ఉంటాను” అని భరోసా ఇచ్చారు.
కేవలం ఉచితాలతోనే ఓట్లు పడవు.. వైసీపినే నిదర్శనం
ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాల పేరిట ఉచితాలు ఇస్తూ మౌలిక వసతులను గాలికొదిలేస్తే ప్రజలు అంగీకరించరని, ఇందుకు గత ఎన్నికల్లో వైసీపికి పట్టిన గతే నిదర్శనమని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, అయితే అవి నిజమైన అర్హులకు మాత్రమే అందాలనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో ఆసుపత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలలో తాగునీటి సరఫరా మరియు రోడ్ల నిర్మాణ పనులను ముమ్మరం చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
20 లక్షల మంది సభ్యత్వ నమోదు.. ‘సాధక్’లకే సర్వాధికారాలు
విశాఖపట్నంలో గతంలో నిర్వహించిన ‘సేనతో సేన’ కార్యక్రమం ద్వారా పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్చడంలో రికార్డు స్థాయిలో శ్రమించిన ‘సాధకులు’ (కార్యకర్తలు) పార్టీకి అసలైన సాధనాలని ప్రశంసించారు.
సుదీర్ఘ కాలంగా నిస్వార్థంగా పనిచేస్తున్న దాదాపు 18,000 మంది సాధకులను గుర్తించి, వారిని నాయకత్వ దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల్లో పార్టీ పదవుల్లోకి ఎవరు రావాలనేది కూడా ఈ సాధకులే నిర్ణయిస్తారని ప్రకటించారు.
పార్టీ విధివిధానాలతో కూడిన ‘రూల్ బుక్’ ప్రకారమే సమాచార సేకరణ కమిటీలు పనిచేయాలని, ప్రతి నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కూడిన కమిటీ పారదర్శకమైన నివేదికలను తన కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తన వ్యక్తిగత కార్యాలయం నుండి అదనంగా ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.





































