రాజధాని రైతుల త్యాగాలు వృథాకానీయం – పవన్ కళ్యాణ్

Amaravati Farmers Protest, Amaravati Farmers Protest Against State Government, AP Capital Issue, Capital Amaravati Farmers Protest, janasena chief, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Responds Over Amaravati Farmers Protest

రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. రాజధాని రైతుల పోరాటం 200 రోజులు దాటిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని నిర్ణయం అయ్యింది కాబట్టి రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారు. తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకొంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అవమానించడమే అని జనసేన తొలి నుంచి చెబుతోంది. రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని సాగుతున్న ఆ పోరాటానికి మా పార్టీ సంఘీభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో కలసి వారికి అండగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 29వేల మంది రైతుల త్యాగాలను వృథా కానీయని” పవన్ కళ్యాణ్ అన్నారు.

“ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంతే తప్ప గత ప్రభుత్వం పేరు మా ప్రభుత్వం వేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదు. రైతులు తమ భూములను ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప ఒక వ్యక్తికో, పార్టీకో కాదు. కాబట్టి ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదు. గత యేడాది కూడా రైతులు నిరసనలు చేపడితే తప్ప కౌలు చెల్లింపులకు నిధులు విడుదల చేయలేదు. ఈ దఫా కూడా అదే పరిస్థితి. కౌలు చెల్లింపులకు జీవో ఇచ్చారు తప్ప రైతులకు ఇప్పటి వరకూ ఆ మొత్తాలు చేరలేదు. ఏప్రిల్ మాసంలో అందాల్సిన కొలు ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడమే. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదు. ఏ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ధి ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + nine =