కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అమరవీరుల స్మారకం (షహీద్ స్మారక్) వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన అభిజీత్ దీప్కేను ఒక మద్దతుదారుడు తన భుజాలపై ఎక్కించుకుని వేదిక వైపు తీసుకువస్తుండగా హఠాత్తుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుంపులో నుంచి ఆయన వైపు దూసుకొచ్చారు. వారు ఒక్కసారిగా దీప్కేపై పడి, పలుమార్లు ఆయన చెంప దెబ్బలు కొట్టారు. మరికొందరు ఆయనను భుజాలపై నుంచి కిందికి లాగడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ అకస్మాత్తు పరిణామంతో అప్రమత్తమైన సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు వెంటనే దాడి చేసిన వారిని పక్కకు లాగేసి దేహశుద్ధి చేశారు. దీనితో ధర్నా స్థలంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ దాడి ఘటనపై అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి భౌతిక దాడులు భీరత్వానికి, భయానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒకటి, రెండు కాదు.. తనపై ఇలాంటివి వంద దాడులు చేసినా, ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టినా నిరుద్యోగ యువత తరఫున తాను ఎత్తుకున్న గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి, వారి ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా ఆవిర్భవించి, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ సరికొత్త రాజకీయ ఉద్యమ వ్యవస్థాపకుడిపై జైపూర్‌లో దాడి జరగడం, దానికి సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.





































