క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు ఉపయోగించే ఖాతాదారులకు మరింత భద్రత కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త సంచలన మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు మోసాల బారిన పడే బాధితులకు తక్షణ ఉపశమనం అందించేలా, ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా ‘షాడో రివర్సల్’ లేదా ‘ప్రొవిజినల్ క్రెడిట్’ (తాత్కాలికంగా నగదు బదిలీ) రూపంలో ఖాతాదారుడి అకౌంట్‌కు జమ చేయాలని స్పష్టం చేసింది.
డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసేలా సవరించిన ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ చారిత్రాత్మక మార్పుల ద్వారా డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ మరియు వినియోగదారుల హక్కుల రక్షణపై దేశీయ బ్యాంకింగ్ రంగం తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటింది.
ఏయే సందర్భాల్లో ఖాతాదారుడిపై బాధ్యత ఉండదు?
ఆర్థిక మోసాలు జరిగినప్పుడు ఖాతాదారులపై ఎటువంటి ఆర్థిక భారం పడకూడదనే అంశాలపై ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్‌లో పూర్తి స్పష్టతనిచ్చింది:
-
బ్యాంక్ లోపాలు: బ్యాంక్ వైపు ఉన్న సాంకేతిక లోపాలు లేదా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే, ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే.. సదరు లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి.
-
థర్డ్ పార్టీ హ్యాకింగ్: బ్యాంక్ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే, ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. (ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, బ్యాంక్ పాలసీ ప్రకారం నిర్ణయం ఉంటుంది).
-
ఫిర్యాదు తర్వాతి లావాదేవీలు: ఖాతాదారుడు మోసం జరిగిందని ఒకసారి ఫిర్యాదు చేసి కార్డ్ బ్లాక్ చేసిన తర్వాత, ఆ ఖాతా నుంచి మళ్లీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా.. ఆ నష్టాన్ని పూర్తిగా బ్యాంకులే భరించాలి.
అదనపు వడ్డీల భారం ఉండదు.. చిన్న బాధితులకు భారీ పరిహారం
బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును షాడో రివర్సల్ ద్వారా వెనక్కి ఇచ్చేటప్పుడు, అది ఏ రోజు అయితే జరిగిందో అదే ఒరిజినల్ తేదీతో (Value Dated) జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా బిల్లింగ్ సైకిల్లో అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని భరించాల్సిన అవసరం ఉండదు.
మరోవైపు, ₹50,000 లోపు మోసపోయిన చిన్న విలువల బాధితుల కోసం ఆర్బీఐ సరికొత్త పరిహార విధానాన్ని తెచ్చింది. మోసం జరిగినట్లు నిర్ధారణ అయిన 5 రోజుల్లోగా నికర నష్టంలో గరిష్టంగా 85 శాతం వరకు లేదా ₹25,000 (ఏది తక్కువైతే అది) పరిహారంగా చెల్లించాలి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చులో 65 శాతాన్ని ఆర్బీఐ భరిస్తుంది.
ఎస్ఎమ్ఎస్ రూల్స్ మార్పు.. విచారణకు గడువు పెంపు
డిజిటల్ చెల్లింపుల సమాచారం తక్షణమే అందేలా బ్యాంకులు ఇకపై ₹500 దాటిన ప్రతి ఎలక్ట్రానిక్ లావాదేవీకి తప్పనిసరిగా ఇన్స్టంట్ ఎస్ఎమ్ఎస్ (SMS) అలర్ట్ పంపాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి ₹5,000 గా ఉండేది. కాగా, మోసాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి బ్యాంకులకు గతంలో ఉన్న 30 రోజుల గడువును దేశీయ లావాదేవీలకైతే 45 రోజులకు, అంతర్జాతీయ (Cross-Border) లావాదేవీలకైతే 60 రోజులకు పెంచుతూ ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంది.





































