అది మెగా రైతు మేళా కాదు.. దగా రైతు మేళా – రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు

BRS Working President KTR Slams Congress Govt Over Farmers' Declaration

తెలంగాణ రాజకీయాల్లో రైతు సమస్యలు మరోసారి వేడి పుట్టించాయి. హనుమకొండలో నిర్వహించిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కేవలం ఒక బోగస్ పత్రమని, రైతులకు చిత్తు కాగితం ఇచ్చి వంచించారని ఆయన విమర్శించారు.

రైతు డిక్లరేషన్ అమలుపై సూటి ప్రశ్నలు

రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందా? రైతు కూలీలకు రూ.12 వేలు అందాయా? అని నిలదీశారు. అన్ని పంటలకు బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.14 వేలు ఇస్తామన్న మాట ఏమైందని, పంటబీమా పథకం ఎక్కడకు పోయిందని ఆయన అడిగారు.

కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పార్టీని కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదిగా కేటీఆర్ అభివర్ణించారు. ఆ పార్టీ నాయకులు చెడ్డీ గ్యాంగ్ కంటే డేంజర్ అని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయానికే రైతుబంధు నిధులు జమయ్యేవని, అప్పట్లో 11 విడతలుగా రూ.73 వేల కోట్లు రైతులకు అందించారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల ముందు ఓట్ల కోసమే రైతు భరోసా ఇచ్చారని ఆయన ఆరోపించారు.

రైతులు తిరగబడాలని పిలుపు

డిక్లరేషన్ అమలు చేయని కాంగ్రెస్ నాయకులను రైతులు గల్లాపట్టి నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “రైతన్నలు కాళ్లు పట్టుకోవడం బంద్ చేసి.. కాంగ్రెస్ వాళ్ల కాలర్ పట్టాలి” అని సూచించారు. దండం పెట్టడం కాదని, కాంగ్రెస్ పార్టీకి పిండం పెడితేనే మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. మక్కలు కొనకపోతే ప్రభుత్వం వెయ్యి ముక్కలవుతుందని, రైతుల తోలు తీస్తామంటే వారు నీ తోలు తీస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here