తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR meeting with Irrigation department, CM KCR Review Meeting, CM KCR Review Meeting on Irrigation Department, Irrigation Department, KCR On Irrigation Department, Telangana CM KCR, Telangana Irrigation Department

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై జూలై 12, ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు అందించాలని చెప్పారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటిలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలని చెప్పారు. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ఆదేశించారు.

‘‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గం. ఇప్పటి వరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగ వినియోగించుకోవాలి. ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలి. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా మరో సారి పరిశీలించాలి. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి. ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వాయర్లను నింపాలి. చివరికి ఆయకట్టుకు నీరందించాలి. ఈ విధంగా ప్రణాళికా ప్రకారం నీటిని సరఫరా చేయాలి. దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు 45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుందని’’ సీఎం కేసీఆర్ చెప్పారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ వరకు రెండు టిఎంసిల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయి. అవి జీవధారలుగా మారతాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టిఎంసిల నీటిని అందుబాటులో ఉంచాలి. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్ఆర్ఎస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలి’’ అని సీఎం చెప్పారు.

“ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటిలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది. వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి వరద కాలువ ద్వారా ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు, దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందిండం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీరు అందించాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

‘‘ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామన్ పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’’ అని సీఎం చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారింది. భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయి. చెరువులు బాగుపడ్డాయి. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. ప్రతీ ఏడాది వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్ పనులు, రిపేర్లు చేసుకోవాలి. జూన్ నాటికి సర్వం సిద్ధం కావాలి. పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్ కు ఒక సిఇని బాధ్యుడిగా నియమించాలి. సిఇ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతే ఒకే విభాగంగా పనిచేయాలి. అధికారులకు కావాల్సిన అధికారాలు అప్పగించాలి. ప్రతీ స్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =