సాగునీటి ప్రాజెక్టుల్లో భూసేకరణకే తొలి ప్రాధాన్యం – అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Directs Officials To Prioritise Land Acquisition For Irrigation Projects

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సివిల్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తిరిగొచ్చిన సీఎం, గురువారం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించి పలు ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పర్యటనలో ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మరియు పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

కొడంగల్ లిఫ్ట్, నెట్టెంపాడు పంప్‌హౌజ్ పరిశీలన

  • మక్తల్ పర్యటన: కర్ణాటక చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్న సీఎం, మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎల్‌ఐఎస్) సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం పంప్‌హౌజ్ పనులను పరిశీలించి, ప్యాకేజీ-1లో కాంక్రీట్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి కావాలని, నిధుల కొరత లేకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

  • నెట్టెంపాడు సందర్శన: అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలోని నెట్టెంపాడు స్టేజ్‌-1 పంప్‌హౌజ్‌కు చేరుకుని పరిశీలించారు. జూరాల సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో కలిసి ప్రత్యేక వీడియోను వీక్షించారు. జూరాల మరియు ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచే పనులపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన డీపీఆర్‌ను పరిశీలించి ఎక్కువ నీటిని నిల్వ చేసే పనులపై సీఎం సానుకూలంగా స్పందించారు.

భూసేకరణ కలెక్టర్ల బాధ్యత – నిధుల మంజూరు

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలో నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాస) పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అధికారులు తమ నెలవారీ నిధుల అవసరాల నివేదికను ఒక నెల ముందే సమర్పించాలని ఆదేశించారు.

ఖచ్చితమైన వర్క్ ప్లాన్.. కోర్టు స్టేలపై చర్యలు

భూసేకరణ మరియు ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తికాకుండా పెద్ద ఎత్తున సివిల్ పనులు చేపడితే ఆర్థిక వనరులను కచ్చితత్వంతో ఖర్చు చేయలేమని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి స్పష్టమైన ఆర్థిక అవసరాలు, టైమ్‌లైన్స్‌తో ముడిపెట్టిన కచ్చితమైన వర్క్‌ప్లాన్లను ఇంజనీర్లు తయారు చేయాలన్నారు. ప్రాజెక్టులపై ఉన్న కోర్టు కేసులపై త్వరగా చర్యలు తీసుకుని, వర్క్స్‌పై ఉన్న స్టేలను ఎత్తివేయించేలా చూడాలని అధికారులకు సూచించారు.

పాలమూరు-రంగారెడ్డితో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రస్తుతం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ 100 శాతం, ఏదుల రిజర్వాయర్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని, వట్టెం రిజర్వాయర్‌ కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here