అగ్ర రాజ్యం అమెరికా సైనిక చర్యతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాన్ని యూఎస్ లక్యంగా చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపంలోకి మారాయి. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నౌకల రవాణాకు, తమ సైనిక బలగాలకు పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు అంటూ అమెరికా దళాలు ఇరాన్ సైనిక స్థావరంపై సరికొత్త వైమానిక దాడులకు దిగాయి.
హర్మూజ్ జలమార్గం గుండా వెళ్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన నాలుగు వన్-వే అటాక్ డ్రోన్లను యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు గాల్లోనే సమర్థవంతంగా కూల్చివేశాయి. ఆ వెంటనే, ఐదో డ్రోన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న ఇరాన్ రేవు పట్టణం ‘బందర్ అబ్బాస్’ లోని గ్రౌండ్ కంట్రోల్ సైనిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ మెరుపు దాడులను నిర్వహించింది.
పూర్తిగా ఆత్మరక్షణ కోసమే దాడులు: అమెరికా సమర్థన
పశ్చిమాసియా ప్రాంతీయ జలాల్లో భద్రతను పర్యవేక్షించడం మరియు తమ దళాల రక్షణ కోసమే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇరాన్ వైపు నుంచి మరిన్ని దాడులు లేదా కవ్వింపు చర్యలు చోటుచేసుకోక ముందే ముందస్తు జాగ్రత్తగా, పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు యూఎస్ దళాలు వెల్లడించాయి.
తాజా వైమానిక దాడుల కారణంగా ఇరాన్ వైపు ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది లేదా ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే దానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే, ఈ దాడుల సమయంలో బందర్ అబ్బాస్ పట్టణానికి తూర్పు ప్రాంతంలో వరుసగా మూడుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు పూర్తిగా అప్రమత్తమై తమ రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఇరాన్
సున్నితమైన హర్మూజ్ జలసంధి పరిధిలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిప్పులు చెరిగింది. ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలను అమెరికా పూర్తిగా ఉల్లంఘిస్తోందని టెహ్రాన్ ఆరోపించింది. కాగా, పశ్చిమాసియాలో దౌత్యపరమైన శాంతి చర్చలు ఒకపక్క కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్‌తో ఎలాంటి కొత్త శాంతి ఒప్పందం కుదరాలన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కఠినమైన షరతులను విధిస్తున్నారు.
అబ్రహాం ఒప్పందాలపై (Abraham Accords) సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే మరియు ఖతార్ దేశాలు సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే ఇరాన్‌తో తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని ఆయన క్యాబినెట్ సమావేశం అనంతరం తేల్చి చెప్పారు. ఈ వ్యూహాత్మక ఒప్పందాలను విజయవంతం చేసే బాధ్యతలను పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లకు అప్పగించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.




































