రూర్బ‌న్ ప్రాజెక్టు ప‌నుల ఖ‌రారు‌పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao Latest News, Minister Errabelli, Minister Errabelli Dayakar Rao, Minister Errabelli Review Meeting, Minister Errabelli Review Meeting on Works under Rurban Project, National Rurban Mission, Rurban Mission, Rurban Project

రూర్బ‌న్ ప్రాజెక్టు కింద చేప‌ట్టాల్సిన ప‌నుల ఖ‌రారు, ప‌ర్వ‌త‌గిరి, రాయ‌ప‌ర్తి మండ‌లాల డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, క‌ల్లాలు, ప్ర‌గ‌తిలో ఉన్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌పై గురువారం నాడు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సమీక్ష నిర్వహించారు. వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిత‌, డిఆర్డిఎ, ఇరిగేష‌న్, పంచాయ‌తీరాజ్, విద్యా, ప‌ర్యాట‌క వంటి ప‌లు శాఖ‌ల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ “అభివృద్ధి ప‌నులు ఆల‌స్య‌మైతే క్ష‌మించేది లేదు. నిర్ణీత గ‌డ‌వులోగా ఆయా ప‌నులు క‌ఛ్చితంగా పూర్త‌వ్వాలి. నాణ్య‌త ప్ర‌మాణాల‌తోపాటు వేగం కూడా అవ‌స‌ర‌మే. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సీఎం కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోర్చి ప్ర‌జ‌ల సంక్షేమం-అభివృద్ధి గురించి ప‌రిత‌పిస్తున్నారు. అందుకునుగుణంగా ప‌నులు జ‌రిగేలా అధికారులు క‌ష్ట‌ప‌డాల‌ని” ఆదేశించారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో వెనుక‌బ‌డిన తెలంగాణ‌ను కొట్లాడి ప్ర‌త్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నామ‌ని, సీఎం కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో తెలంగాణ అభివృద్ధికి అద్భుత అవ‌కాశాలు ఏర్ప‌డ్డాయ‌ని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్పుడూ కాద‌నే విధంగా అభివృద్ధికి అనేక అవ‌కాశాలు, నిధులు వ‌స్తున్నాయ‌న్నారు. వాటిని స‌ద్వినియోగం చేయాల్సిన బాధ్య‌త అటు అధికారులు, ఇటు ప్ర‌జాప్ర‌తినిధుల‌పైనా ఉంద‌న్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్త‌గా ఉపాధి హామీ కింద వ‌చ్చిన క‌ల్లాల‌ను వేగంగా, నాణ్య‌త‌తో పూర్తి చేయాల‌న్నారు. రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాలువ‌ల మ‌ర‌మ్మ‌తులు వంటి అన్ని ర‌కాల ప‌నుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్షించారు.

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి జ‌రుగుతున్న ఆల‌స్యంపై కాంట్రాక్ట‌ర్ల‌పై మంత్రి మండిప‌డ్డారు. వాళ్ళు అడిగినంతా స‌మ‌యం ఇచ్చాం. ఇసుక వంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చాం. అయినా, నిర్మాణాలు పూర్తి కావ‌డం లేదు. అలాంటి కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్టుల్లో వేయండని క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. పూర్త‌యిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌కు ఈ నెల 20-25 తేదీల్లో ప్రారంభోత్స‌వాలు చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు చెప్పారు. ఇంకా పూర్తి కావాల్సిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను ఆయా మండ‌లాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అప్ప‌గించారు. అధికారులు ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌పాల‌ని, స్థానిక ప్ర‌జాభిప్రాయాలు, ప్ర‌జావ‌స‌రాల‌ను దృష్టిలో పెట్ట‌కుని ప‌ని చేయాల‌ని మంత్రి సూచించారు.

మ‌రోవైపు రూర్బ‌న్ ప్రాజెక్టు కింద ప‌ర్వ‌త‌గిరికి మంజూరైన రూ.30 కోట్ల నిధుల‌ను ఏయే ప‌నుల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేయాల‌నే అంశంపై మంత్రి ఎర్ర‌బెల్లి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ తో క‌లిసి ఖ‌రారు చేశారు. ప‌ర్వ‌త‌గిరి మండ‌లంలో మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల్సిన ఈ నిధుల‌తో 50కి పైగా ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ప‌ర్వ‌త‌గిరిలో మ‌ల్టీ జిమ్, మినీ స్టేడియం, ట్యాంకు బండ్ ఆధునీక‌ర‌ణ‌, ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చ‌డం, ప‌ర్వ‌త‌గిరి, క‌ల్లెడ‌లో క్ల‌స్ట‌ర్ క‌మ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అలాగే, ఏనుగ‌ల్, చౌట‌ప‌ల్లి స్కూల్స్ లో సైన్స్ ల్యాబ్ లు, ప‌ర్వ‌త‌గిరి చౌర‌స్తాలో షాపింగ్ కాంప్లెక్స్ తోపాటు లైబ్ర‌రీ ఏర్పాటు, ప‌ర్వ‌త‌గిరి, క‌ల్లెడ‌, అన్నారం, రోళ్ళ‌క‌ల్, కొంక‌పాక‌, చౌట‌ప‌ల్లి, తురుపు తండా, దౌల‌త్ న‌గ‌ర్ ల‌లో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అన్నారం ష‌రీఫ్ ద‌ర్గా చెరువు ఆధునీక‌ర‌ణ‌కు నిర్ణ‌యించారు. అలాగే, కొంక‌పాక‌, ఎనుగ‌ల్లు వ‌ద్ద ప‌శు వైద్య ఉప కేంద్రాలు, ప‌ర్వ‌త‌గిరిలో సంత‌, గోప‌న‌ప‌ల్లి, రావూరు, నారాయ‌ణ‌పురం వ‌ద్ద ప‌ప్పు మిల్లులు, చిరు ధాన్యాలు, డీ హ‌స్కింగ్ యంత్రాలు, మ‌క్క‌జొన్న‌ల షెల్ల‌ర్లు, ఎనుగ‌ల్లులో వ్య‌వ‌సాయ గోదాముల నిర్మాణాలు చేప‌ట్టాల‌ని మంత్రి నిర్ణ‌యించారు. అన్నారం ద‌ర్గా, ప‌ర్వ‌త‌గిరిల్లో కబేళాల నిర్మాణం అవ‌స‌ర‌మ‌ని భావించారు. ఇంకా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, చింత నెక్కొండ బ‌స్ షెల్ట‌ర్, ప‌లు గ్రామాల్లో స్థానికంగా వ్య‌వ‌సాయోత్ప‌త్తుల‌న‌నున‌స‌రించి చిన్న త‌ర‌హా, కుటీర ప‌రిశ్ర‌మ‌లు కూడా నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఆయా ప‌థ‌కాల పూర్తి ప్రాజెక్టు రిపోర్టుల‌ను సిద్ధం చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nine =