వానాకాలం సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

gangula kamalakar, Gangula Kamalakar Meeting with Rice Millers, Gangula Kamalakar Meeting with Rice Millers and Ration Dealers, Minister Gangula Kamalakar, Ration Dealers, telangana, Telangana Free Rations, Telangana Minister Gangula Kamalakar, Telangana News, Telangana Ration Dealers Meeting, Telangana Rice Distributions

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపు, దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్ లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగడంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం నాడు పౌరసరఫరా భవన్ లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లతో వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ, గత ఏడాది వానాకాలంలో 47.54, యాసంగిలో 64.50, మొత్తం కోటి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖలో భాగస్వామ్యులని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా రేషన్ డీలర్లను కాని, రైస్ మిల్లర్లను కాని ఇబ్బంది పెట్టబోదని, సీఎం కేసీఆర్ తో చర్చించి వారి న్యాయపరమైన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి లేక రైస్ ఇండస్ట్రి గడ్డు పరిస్థితిని ఎదుర్కొందని, ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్తగా రైస్ మిల్లులు ఏర్పటవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారుతోందన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఒకవైపు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతుండగా, మరోవైపు కార్మికులకు ఉపాధి కేంద్రంగా మారిందని అన్నారు.పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా భారీగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని, దీనికి పెద్ద ఎత్తున గన్నీ సంచులు అవసరమని, దాదాపు 10 కోట్లు కొత్తవి, 9 కోట్లు పాత గన్నీ సంచులు అవసరం ఉందన్నారు. కలకత్తా నుంచి అవసరమైన మేరకు కొత్త గన్నీ సంచులు వచ్చే అవకాశం లేదని, దీంతో పాత గన్నీ సంచుల అవసరం ఎక్కువగా ఏర్పడిందన్నారు. ప్రభుత్వ అవసరాలను గుర్తించి రేషన్ డీలర్లు తమ దగ్గర ఉన్న గన్నీ సంచులను తప్పనిసరిగా పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని ఆదేశించారు. ఒక్క బ్యాగును పౌరసరఫరాల సంస్థకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి రూ.15 ఆదా అవుతుందన్నారు. దీన్ని ఒక బాధ్యతగా రేషన్ డీలర్లు గుర్తించలన్నారు.

పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా సమయంలో రేషన్ డీలర్లు ఉచితంగా పంపిణీ చేసిన బియ్యానికి కూడా సీఎం ఆదేశాల మేరకు కమిషన్ ఇవ్వడం జరిగింది. గన్నీ సంచుల విషయంలో రేషన్ డీలర్ల కూడా ప్రభుత్వానికి సహకారించాలన్నారు. జనవరి నుంచి ఆగస్ట్ వరకు రేషన్ డీలర్ల నుంచి 3 కోట్ల 96 లక్షల గన్నీ సంచులు రావాల్సి ఉండగా, కేవలం 47 లక్షల 11 వేలు మాత్రమే వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ధాన్యం దించుకునే సమయంలో చూపించిన ఉత్సాహం సీఎంఆర్ అప్పగించడంలో కనిపించడం లేదు. సీఎంఆర్ లో జాప్యం జరిగితే పౌరసరఫరాల సంస్థపై అదనంగా ఆర్థిక భారం పడుతోంది. పౌరసరఫరాల సంస్థలో రైస్ మిల్లర్లు కూడా భాగస్వామ్యులే అన్న విషయాన్ని గుర్తించి సీఎంఆర్ లో జాప్యం లేకుండా చూడాలి. అలాగే ఏ సీజన్ కు సంబంధించిన గన్నీ సంచులను ఆ సీజన్ లోనే పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలి. ఈ వానాకాలంలో కూడా భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి రైస్ మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =