కరోనా నియంత్రణ చర్యలు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, పలు ఇతర అంశాలపై నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కరోనా కట్టడికి భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కావున వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు విడుదల చేస్తాయని తెలిపారు. మాస్కుల వినియోగం, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాలన్నారు.
అనంతరం మాన్సూన్ యాక్షన్ ప్లాన్పైనా మంత్రి కేటిఆర్ సమీక్ష జరిపి, సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో వచ్చే డెంగీ తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. డెంగీ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యాంటీ లార్వా యాక్టివిటీస్ కార్యక్రమాన్ని ఈ ఆదివారం నుంచే ప్రారంభించాలన్నారు. ప్రతి ఆదివారం ‘పది గంటలకు-పది నిమిషాలు’ పేరిట నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ప్రతి పట్టణంలో మురుగుకాల్వలను శుభ్రంచేసి చెత్తను తరలించాలని చెప్పారు. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయాలన్నారు. ప్రతి పట్టణంలో మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలు, మాస్కులు లేకుండా పనిచేయరాదన్నారు. అలా కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే రూ.830 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులపై నివేదిక పంపాల్సిందిగా కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu