రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప‌నిలో రేవంత్‌

Revanth in the Task of Ruining the State, Task of Ruining the State, Revanth Ruining the State, Revanth Reddy, CM Revanth reddy, Telangana CMO, Congress, Latest Telanagana Budget News, Telangana debut News, Low Budget Telangana, Telangana Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Revanth Reddy, CM Revanth reddy, Telangana CMO, Congress

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి సంచ‌ల‌నం శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌. గత తొమ్మిదినరేళ్లలో రాష్ట్ర అప్పు 72,658 కోట్లు నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగిందని, దాదాపు 10 రెట్లు అప్పు పెంచార‌ని శాస‌న‌స‌భ సాక్షిగా వెల్ల‌డించింది. తెలంగాణ బడ్జెట్‌కు.. వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని ప్ర‌క‌టించింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై కొత్త స‌ర్కారు విడుద‌ల చేసిన ఈ శ్వేత‌ప‌త్రం ప్ర‌తిప‌క్షాన్ని ఓ కుదుపు  కుదిపేసింది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌నూ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మ‌రోవైపు కొంత ఆందోళ‌న‌నూ రేకెత్తించింది. రాష్ట్రం ధీన‌స్థితిని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బ‌హిర్గ‌తం చేయ‌డం ద్వారా ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌స్తారా? అనే సందేహాలూ త‌లెత్త‌తాయి. ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు కూడా. అధికార పార్టీ లెక్క‌లు క‌రెక్ట్ కాద‌ని ఖండిస్తూనే.. ఇలా ప్ర‌భుత్వ‌మే చెప్పుకోవ‌డం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం క‌లిగించే అంశ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇది బాగానే చ‌ర్చ‌నీయాంశం అయింది.

దాంతో ఖంగుతిన్న మంత్రులు ఆ అంశాన్ని డైవ‌ర్ట్ చేసి స‌ర్దిచెప్పుకోవ‌డానికి తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిజాలను నిక్క‌ర్చిగా వెల్ల‌డిస్తూ.. రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయ‌నుకుంటే.. గ‌త ప్ర‌భుత్వం ఖాళీ బిందెల‌ను మిగిల్చింద‌ని చెబుతూనే.. డ‌బ్బు లేని కార‌ణంగా అభివృద్ధి ఆగ‌కుండా చేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వం చెప్పింది చేస్తుంద‌ని ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. భారీ ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల‌పై చ‌క‌చ‌కా స‌మీక్ష‌లు జ‌రుపుతూ ఆయా ప‌నులు ఆఘ‌మేఘాల మీద పూర్తి చేసేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. త‌క్కువ వ్య‌యంతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లిగేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఆర్బీఐ పూర్వ అధికారులు, నిపుణుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఖ‌జానా ఖాళీ అని చెబుతున్న‌ప్ప‌టికీ.. గ‌త ప్ర‌భుత్వం కంటే ఎక్కువ‌గానే సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మొద‌టి వారంలోనే జీతాలు ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. ఒకటో తేదీన అందాల్సిన జీతాల‌ను గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 20 వ తేదీ వ‌చ్చినా కొంద‌రికి అందేవి కావు. దీంతో ఈఎంఐలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం ఉద్యోగులు ఇబ్బందులు ప‌డేవారు. పింఛనర్ల ప‌రిస్థితి ఇంకాస్త ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడా ప‌రిస్థితిని మారుస్తూ కాంగ్రెస్ స‌ర్కారు ఉద్యోగులు, పెన్స‌న్ష‌ర్ల‌కు నాలుగో తేదీకే చెల్లింపులు చేసింది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగానే కొత్త సర్కారులో ఉద్యోగులు, పింఛనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది.

ప్రస్తుత సర్కారు సకాలంలో వేత‌నాలు మంజూరు చేయ‌డంపై ఉద్యోగులు, పెన్స‌న‌ర్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతి నెల 12, 20 తేదీ వరకు జీతాలిచ్చిన పద్ధతికి స్వస్తి ప‌లికామ‌నే సంకేతాలు పంపారు. దీనిపై ఉద్యోగులు, పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదట కూడా ఇదే విధానం అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఆలస్యం కావడం మొదలైంది. అలవికాని హామీలు, కొత్త పథకాలను ప్రకటించి, నిధులను మళ్లించడంతో త్వరగా అందించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో 12, 20 తేదీల వరకు చెల్లిస్తూ వచ్చారు. ఖజానాలో నిల్వలను బట్టి ఒక్కో రోజు కొన్ని జిల్లాల వారికి ఇచ్చే పద్ధతిని అమలు చేశారు. దీన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసించాయి.

రాష్ట్రం అప్పుల‌కుప్ప‌ల్లో ఉంద‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఇప్పుడు స‌కాలంలో జీతాలు ఇచ్చి.. ప‌రిస్థితి ఎలా ఉన్నా తాము గాడిన పెడుతున్నామ‌నే సంకేతాలు పంపింది. అప్పుల సంగ‌తి ఎలా ఉన్నా.. ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు ప‌రుస్తూ ప్ర‌జ‌లకు, స‌కాలంలో జీతాలు  ఇస్తూ ఉద్యోగులకు భ‌రోసా క‌ల్పిస్తోంది. మొత్తంగా తొలిమాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్ని ర‌కాలుగానూ మంచి మార్కులే పొందుతున్నారు. మున్ముందు ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే దానిపై రాష్ట్ర, కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =