ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు

KCR Huge Slew Of Sops For RTC Employees, KCR Meeting With RTC Employess, kcr promises to rtc employees, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో డిసెంబర్ 1, ఆదివారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ పలు వరాలు ప్రకటించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని సీఎం కేసీఆర్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదివారం ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇ.డి.లు, ఆర్ఎంలు, డివిఎంలు, డిఎంలు, కంట్రోలర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన సీఎం కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సీఎం స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమిష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్పూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని కోరారు. తాను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందని సీఎం అన్నారు. ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని చెప్పారు. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ప్రకటించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో రోజుకు గంటో, అరగంటో ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా, కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని సీఎం ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదని గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్ లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు:

  • ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి
  • ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం 
  • ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం
  • ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం
  • సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం 
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం
  • ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది
  • సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము
  • కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు 
  • మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి
  • ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
  • మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం 
  • మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం
  • మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం
  • రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు
  • ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం
  • ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి
  • ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు
  • ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి
  • ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
  • ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం
  • డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం
  • ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం
  • ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది 
  • ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =