755 మంది వైద్య సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి : మంత్రి ఈటల

COVID-19 Situation, Eatala Rajender, Eatala Rajender Press Meet, Health Minister Eatala Rajender Press Meet, Mango News, Oxygen, Oxygen Crisis, Oxygen Supply, Oxygen Supply In Telangana, Oxygen Supply to Covid Patients, telangana, Telangana Health Minister, Telangana Health Minister Eatala Rajender Press Meet over Covid-19 Situation, Telangana Health Minister Eatala Rajender Press Meet over Covid-19 Situation in the State, Telangana Oxygen Supply

కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నాడు కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి బూర్గుల రామకృష్ణ రావు భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు:

“మహారాష్ట్రలో, కర్ణాటకలో కేసులు పెరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ఆక్సిజన్ నిలువలు, వైద్య సిబ్బంది, హెూమ్ ఐసోలేషన్ కిట్లు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆరు లక్షల రెమెడెసీవీర్ ఇంజక్షన్ ఆర్డర్ పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారని వార్తలు రావడంతో ఆక్సిజన్ సమకూర్చడం కోసం ఆక్సిజన్ టాంక్ లను యుద్ధ విమానంలో పంపించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇలా తీసుకొచ్చిన ఆక్సిజన్ ను ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని ఆసుపత్రులకు సమానంగా అందిస్తున్నాము. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులలో, అతి పెద్ద ప్రైవేటు ఆసుపత్రులలో, మెడికల్ కాలేజీలకి అనుబందంగా ఉన్న ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేదు, రాష్ట్రంలో 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించింది. ఎక్కువ దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కాకుండా బళ్లారి నుంచి ఆక్సిజన్ ను అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాయడంతో సానుకూలంగా స్పందించారు. అయితే జిల్లాలో కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్ సరఫరా చేసే వారితో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇబ్బందుల వల్ల వారికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. వాటిని కూడా ఐఏఎస్ అధికారుల బృందం పరిష్కరించి అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నాము. ముందుచూపుతో 22 ఆసుపత్రిలలో 20 kl లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆక్సిజన్ సమస్య రాకుండా అధిగమించాము” మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

మరో 3010 పడకలను సిద్ధం చేస్తున్నాం:

పీఎం కెర్స్ ద్వారా 5 ఆక్సిజన్ జనరేటర్ మిషన్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో గాంధీ ఆస్పత్రిలో రోజుకు 28 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ జనరేటర్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం . టీమ్స్ ఆసుపత్రిలో 14 లక్షల లీటర్లు, ఖమ్మం ఆస్పత్రిలో ఎనిమిదిన్నర లక్షల లీటర్లు, భద్రాచలం ఆసుపత్రిలో నాలుగున్నర లక్షల లీటర్లు, కరీంనగర్ లో రోజుకి ఐదున్నర లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేటర్స్ ఏర్పాటు అవుతున్నాయి. వీటిద్వారా మొత్తం రోజుకి 62 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసుకోగలం. వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆక్సిజన్ సమస్యలు కూడా అధిగమించగలం అని భావిస్తున్నాము. మరో 12 మిషన్లు కావాలని కేంద్రానికి విన్నవించాం. త్వరలోనే అనుమతి వస్తుందని భావిస్తున్నాము. కరోనా వచ్చిన మొదట్లో కేవలం 1770 ఆక్సిజన్ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పదివేల పడకలకి ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం వెంటిలేటర్స్ దొరకటం లేదు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేవు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో 3010 పడకలను సిద్ధం చేస్తున్నాము” మంత్రి తెలిపారు.

755 మంది డాక్టర్లు వైద్య సిబ్బందిని నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి:

“ఈరోజు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఈఎస్ఐ అధికారులతో సమావేశం అయ్యాము. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో పూర్తిస్థాయి సిబ్బందితో 350 పడకలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని రేపటి నుంచి పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో ఐసియూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేయనున్నాము. వీటితోపాటు నిమ్స్ ఆసుపత్రిలో మరో రెండు వందల ఆక్సిజన్ పడకలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మరో వెయ్యి పడకలకు అవసరం అయ్యే సీపాప్, బైపాప్, మానిటర్స్, వెంటిలేటర్లను సీఎం అనుమతితో సమకూర్చుకుంటున్నాము. అలాగే 755 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతించారు. వీటితోపాటుగా ఆసుపత్రుల వారిగా ఎక్కడ అవసరం ఉన్న వారిని అక్కడ నియామకాలు చేసుకునేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో కూడా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించడం వల్ల కేసులు తగ్గి సాధారణ స్థితి అతి త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము” అని మంత్రి అన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులు కూడా సహకరించాలి, తీరు మార్చుకోవాలి:

“కరోనా సోకి ఇంట్లో ఉండే అవకాశం లేని వారికి ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటుగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆక్సిజన్ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత స్టెప్-డౌన్ కోసం ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం అనేక జీవోల ద్వారా కరోనా పేషంట్లకు ఎంత చార్జి చేయాలి నిర్ధారణ చేసాము. సాధారణ పడకలకు అయితే 4 వేల రూపాయలు, ఐసీయూలో ఉండి వెంటిలేటర్ లేకపోతే 7500 రూపాయలు, ఐసీయూలో ఉండి వెంటిలేటర్ అవసరమైతే తొమ్మిది వేల రూపాయలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము. వీటిని అమలు చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు వారిని కోరుతున్నాము. అలా కాకుండా పేషంట్లు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోండి, ఇంజక్షన్లు తెచ్చుకోమని, హాస్పిటల్లో చేర్చుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని, ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ కార్డులు ఉన్నా తీసుకోకపోవడం, చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా డబ్బులు కట్టాలి అని డిమాండ్ చేయడం సభ్యసమాజం హర్షించే విషయం కాదు. ఈ సమయంలో వ్యాపార కోణంలో చూడకండి. ఇప్పుడు మనిషిలాగా వ్యవహరించండి అని పదేపదే చెబుతున్నాము. ప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను పాటించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం ఆక్సిజన్ కొరత ఏర్పడితే ప్రభుత్వం ముందుకు వచ్చి సరఫరా చేస్తూ సహకరిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు కూడా సహకరించాలి, అవకాశం వచ్చింది కదా అని సంపాదించుకోవటం సబబు కాదు. తీరు మార్చుకోవాలని కోరుతున్నాం” అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ కొనుక్కోవాలి అని చెప్పడం బాధాకరం:

“కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టింది. కేంద్రమైన రాష్ట్రమైనా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్ము అని మర్చిపోవద్దు. అలా కాకుండా రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుక్కోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం. ప్రతి రూపాయ పన్ను ద్వారనే వచ్చింది అని గుర్తు పెట్టుకోవాలి. కేంద్రం అత్యంత శక్తివంతమైనది. వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి రాష్ట్రాలకు అందజేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ కొనుక్కోవాలి అని చెప్పడం బాధాకరం. ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయండి అని కోరుతున్నాము. ఇక్కడ ఉత్పత్తి అయినా మెడిసిన్ ఇతర దేశాలకు తరలిపోయింది ఇంకా పంపిస్తే చరిత్ర క్షమించదు. ప్రతి సమస్యపై రాష్ట్రంలో తలెత్తిన ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చేస్తుంది. ముందుచూపుతో పకడ్బందీ ప్రణాళికతో 365 రోజులు కంటి మీద కునుకు లేకుండా పనిచేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ స్థాయిలో ఉంది, లేదంటే ఇతర రాష్ట్రాల్లోగా ఇబ్బంది పడే వాళ్ళం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతో ఒత్తిడిలో పని చేస్తున్నారు. కరోనా సోకిన కూడా తిరిగి విధుల్లోకి చేరి ప్రజలకు సేవ అందిస్తున్నారు. ఇలా కమిట్మెంట్లో పనిచేస్తున్న వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా మంచిది కాదు. అలసత్వం ఉంటే ఇలా ఉండేది కాదు” అని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =