ముచ్చింతల్ లోని సమతామూర్తి కేంద్రంలో రేపు 108 ఆలయాల్లో కల్యాణ మహోత్సవం

Tridandi Chinna Jeeyar Swamy Announces Shanthi Kalyanam of 108 Deities will be Held Tomorrow

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఇటీవల శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ నుంచి ఫిబ్రవరి 14 వ వరకు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అలాగే ఫిబ్రవరి 13న సమతామూర్తి కేంద్రంలోని మొదటి అంతస్తులోని భద్రవేదిలో 120 కేజీల శ్రీ రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. కాగా ఫిబ్రవరి 14న జరగాల్సిన శాంతి కల్యాణంకు భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉండడంతో వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 19, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో కల్యాణ మహోత్సవం జరగునుందని తెలిపారు. శనివారం జరగనున్న శాంతి కల్యాణానికి శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొన్న వారితో పాటుగా, భక్తులందరూ ఆహ్వానితులే అని తెలిపారు. అందరూ కల్యాణాన్ని దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దేవుడికి పూజ, యాగం జరిగే చోటా ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి ప్రతి రోజు మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు రామానుజాచార్యులను దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తున్నామని, ఫిబ్రవరి 20 నుంచి సువర్ణమూర్తిని కూడా దర్శించుకునే అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. భక్తులకు పూర్తిస్థాయిలో దర్శనం కల్పించేందుకు ఇంకొంచెం సమయం పడుతుందని అన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో విబేధాలు అంటూ వస్తున్న వార్తలపై త్రిదండి చినజీయర్​ స్వామి స్పందిస్తూ, ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలకు సీఎం కేసీఆర్ పూర్తి సహకారం ఉందని, విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ ను ఆహ్వానించామని తెలిపారు. ముందుగా సమతామూర్తి కేంద్రానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తాను ప్రథమ సేవకుడినని చెప్పినట్టు గుర్తుచేశారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ దృష్ట్యా సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాలేకపోయి ఉండొచ్చన్నారు. ప్రతిపక్షం, స్వపక్షం అనేవి కేవలం రాజకీయాల్లోనే ఉంటాయన్నారు. తమకు అందరూ సమానమేని, ప్రతి ఒక్కరూ సమతామూర్తిని సందర్శించాలనేది తమ ఆకాంక్షని శ్రీ చినజీయర్‌ స్వామి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =