టీ20 వరల్డ్ కప్ 2026: సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం

T20 World Cup 2026 India Beat England in Semi-Final to Enter Finals

ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరాటాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లుగానే భారత జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించి, ఇంగ్లాండ్‌పై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

తొలుత బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోరు సాధించినా, ఛేదనలో ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ సృష్టించిన విధ్వంసం ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరకు అద్భుత బౌలింగ్‌తో గట్టెక్కిన టీమిండియా, ఆదివారం అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసిన శాంసన్, ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అభిషేక్ శర్మ (9) త్వరగానే వెనుదిరిగినా, ఇషాన్ కిషన్ (39) తో కలిసి శాంసన్ రెండో వికెట్‌కు 97 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27) తమ వంతుగా మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. వికెట్లు పడుతున్నా రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా జాకబ్ బెథెల్ సాగించిన బాదుడు భారత అభిమానుల్లో గుబులు రేపింది. కేవలం 45 బంతుల్లోనే శతకం బాదిన బెథెల్ (105), మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేలా కనిపించాడు.

అతడికి జాక్స్ (35) తోడవ్వడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే 18వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 6 పరుగులే ఇచ్చి కట్టడి చేయడం మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది. చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సిన వేళ, తొలి బంతికే బెథెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా, క్లిష్ట సమయంలో బుమ్రా వేసిన ఓవర్లు భారత్‌ను విజేతగా నిలబెట్టాయి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు 2024 సెమీఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేస్తూ ఇంగ్లాండ్‌ను ఇంటికి పంపింది.

మొత్తానికి వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు అసలైన వినోదాన్ని పంచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్‌లో భారత్ ఇదే జోరును కొనసాగించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు.

స్కోరు బోర్డు

భారత్‌: శాంసన్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 89, అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 9, ఇషాన్‌ (సి) జాక్స్‌ (బి) రషీద్‌ 39, దూబే (రనౌట్‌) 43, సూర్యకుమార్‌ (స్టంప్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 11, హార్దిక్‌ (రనౌట్‌) 27, తిలక్‌ (బి) ఆర్చర్‌ 21, అక్షర్‌ (నాటౌట్‌) 2, వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 253/7.

వికెట్ల పతనం: 1-20, 2-117, 3-160, 4-190, 5-212, 6-236, 7-251.

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-61-1, జాక్స్‌ 4-0-40-2, ఒవర్టన్‌ 3-0-36-0, కర్రాన్‌ 4-0-53-0, రషీద్‌ 4-0-41-2, డాసన్‌ 1-0-19-0.

ఇంగ్లండ్‌: సాల్ట్‌ (సి) అక్షర్‌ (బి) హార్దిక్‌ 5, బట్లర్‌ (బి) వరుణ్‌ 25, బ్రూక్‌ (సి) అక్షర్‌ (బి) బుమ్రా 7, బెథెల్‌ (రనౌట్‌) 105, బాంటన్‌ (బి) అక్షర్‌ 17, జాక్స్‌ (సి) దూబే (బి) అర్ష్‌దీప్‌ 35, కర్రాన్‌ (సి) తిలక్‌ (బి) హార్దిక్‌ 18, ఒవర్టన్‌ (నాటౌట్‌) 2, ఆర్చర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 246/7.

వికెట్ల పతనం: 1-13, 2-38, 3-64, 4-95, 5-172, 6-222, 7-225.

బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-51-1, హార్దిక్‌ 4-0-38-2, బుమ్రా 4-0-33-1, వరుణ్‌ 4-0-64-1, అక్షర్‌ 3-0-35-1, దూబే 1-0-22-0.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here