ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నేడు అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత భాగమని, ఎవరూ చట్టానికి అతీతులు కాదంటూ ఆయన ఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఆ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.
2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్ రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన తీర్పు అని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘాన్ని బెదిరించాలని చూడటం, తాము చెప్పిందే చట్టమనేలా వ్యవహరించడం హేయమన్నారు.
పుంగనూరులో వైకాపా ఎంపీ కాన్వాయ్‌లో లిక్కర్ బాటిళ్లు, మారణాయుధాలు దొరకడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. గంజాయి స్మగ్లర్లను కూడా బరిలో దింపిన ఘనత వైకాపాదేనని మండిపడ్డారు. గతంలో వారి హయాంలో కడప జిల్లాలోనే 79 శాతం ఎంపీటీసీలు (553 స్థానాలకు 439) ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర వారిదని, ఇప్పుడేమో నిబంధనల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
2024 ఎన్నికల తర్వాత ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సంక్షేమం, సుపరిపాలనపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం స్పష్టం చేశారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ అందిస్తూ భద్రత కల్పించామని, ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్ ఫేస్-1ను తామే ప్రారంభించామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అమరావతిని పూర్తిగా విధ్వంసం చేశారని, త్యాగాలు చేసిన రైతులను నానావిధాలుగా అవమానించారని చంద్రబాబు ఆరోపించారు. నేడు అదే అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తిరిగి నిర్మిస్తున్నామని, దీనిపై ఎవరికైనా సందేహాలుంటే నేరుగా వచ్చి పరిశీలించవచ్చని ఆహ్వానించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించడం ద్వారా ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయని చెప్పారు. అంతేకాకుండా, నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. “నిజం నిప్పులాంటిది.. దానితో ఆడుకుంటే మసి కాకతప్పదు” అంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు.







































