అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఒక పెద్ద ఊరట లభించింది. శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలంటూ ఇటీవల జారీ చేసిన నిబంధనపై అమెరికా ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆ నిబంధన అందరికీ ఒకేలా వర్తించదని, దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని బట్టి ఇమిగ్రేషన్ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) అధికారికంగా ప్రకటించింది.
తీవ్ర ఆందోళన కలిగించిన గత వారం మార్గదర్శకాలు
తాత్కాలిక వీసాల (Temporary Visas) పై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందాలంటే.. వారు కచ్చితంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని గత వారం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ హఠాత్ ప్రకటనతో అమెరికాలో ఐటీ సహా పలు రంగాలలో స్థిరపడిన హెచ్1బీ (H1B) వీసాదారులు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగులలో తీవ్ర ఆందోళన మరియు అభద్రతాభావం నెలకొంది.
దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో తాజాగా డీహెచ్ఎస్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ఈ నిబంధన కొత్తదేమీ కాదని, ఎప్పట్నుంచో అమల్లో ఉందని స్పష్టం చేసింది. కేవలం ఇమిగ్రేషన్ అధికారులకు ఉన్న విచక్షణాధికారాలను మరోసారి గుర్తు చేయడానికే గత వారం తాము ఆ మార్గదర్శకాలను విడుదల చేశామని వివరించింది.
పరిస్థితులను బట్టే అధికారుల నిర్ణయం.. మినహాయింపులపై సంకేతాలు
నూతన సవరణల ప్రకారం, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుడి ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక ప్రయోజనాలు మరియు అమెరికా జాతీయ ప్రయోజనాల (National Interests) వంటి కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇమిగ్రేషన్ అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. సదరు దరఖాస్తుదారుడు అమెరికాలోనే ఉండి ప్రక్రియను కొనసాగించాలా లేక స్వదేశానికి వెళ్లాలా అనే విషయాన్ని అధికారులు కేసుల వారీగా తేలుస్తారని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.
ప్రత్యేకించి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కీలక రంగాలలో పనిచేస్తున్న వారికి, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన రక్షణ, సాంకేతిక ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపులు లభించే అవకాశం ఎక్కువగా ఉందని యూఎస్సీఐఎస్ ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇచ్చింది.







































