ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా సిరీస్ కోల్పోయిన షాక్ నుంచి తేరుకోకముందే భారత జట్టు ఇంగ్లాండ్‌తో మరో కఠినమైన సవాలుకు సిద్ధమైంది. చెస్టర్ లీ స్ట్రీట్ (యూకే) వేదికగా బుధవారం ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో పరాజయం పాలుకావడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ఇండియాకు ఇంగ్లాండ్ సిరీస్ ఒక కఠిన పరీక్షగా మారనుంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బతీసింది. దీంతో కనీసం ఇప్పుడైనా బ్యాటర్లు ఫామ్‌లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
క్రికెట్ వర్గాల్లో మరియు అభిమానుల్లో ప్రస్తుతం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో అయినా అతడికి అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సంజు శాంసన్ స్థానంలోనే వైభవ్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అభిషేక్‌తో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే ఇద్దరు యువ హిట్టర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అవకాశం ఉంది.
మరోవైపు టీ20 ఫార్మాట్లో ఇంగ్లాండ్ అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతోంది. ముఖ్యంగా జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ వంటి ప్రపంచ స్థాయి ఓపెనర్లు ఆ జట్టుకు ప్రధాన బలం. వీరితో పాటు హ్యారీ బ్రూక్, బెథెల్, బాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్‌లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా లోతుగా ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్, డాసన్‌లతో భారత బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ భారత్‌కు ఇంగ్లాండ్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 టీ20 మ్యాచ్‌లలో భారత్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 12 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఐర్లాండ్ సిరీస్ ఓడినప్పటికీ అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ వంటి పేసర్లు చక్కటి ప్రదర్శన చేశారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌కు తోడుగా వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టడం భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం.
భారత తుది జట్టు (అంచనా): సంజు శాంసన్/వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, సూర్యాంశ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ తుది జట్టు (అంచనా): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జ్యాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.






































