ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామస్వరాజ్యం సాకారం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను మళ్లించిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో పంచాయతీలకు రూ.4,200 కోట్లు జమ చేసిందని ఆయన వెల్లడించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా మెరుగైన, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఎటువంటి అవినీతికి తావులేకుండా, పారదర్శక పద్ధతిలో పదోన్నతులు కల్పించినట్లు వివరించారు. ఓఎస్‌డీగా తన వద్ద పనిచేసి పదవీవిరమణ పొందుతున్న ప్రభుత్వ అదనపు కార్యదర్శి కఠారి వెంకటకృష్ణ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు ప్రత్యేకంగా రేటు కార్డులు అమలు చేశారని, కానీ తమ ప్రభుత్వంలో పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేశామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పదోన్నతులు కల్పించడం వల్ల పంచాయతీ కార్యదర్శుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరిలో నూతన ఉత్సాహం వచ్చిందని, ఫలితంగా గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.1,000 కోట్ల ఆస్తిపన్ను వసూలైందని ప్రశంసించారు.
నిబద్ధతతో పనిచేసే అధికారులకు స్వేచ్ఛనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో గత రెండు దశాబ్దాలుగా వేధిస్తున్న ఫైలేరియా సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించబోతోందని ఉదహరించారు. అలాగే, అత్యంత సమర్థుడైన వెంకటకృష్ణ సేవలు రాష్ట్రానికి మరింత అవసరమని భావించి, ఆయన పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఈ వీడ్కోలు సభలో వెంకటకృష్ణ దంపతులను ఉప ముఖ్యమంత్రి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో, వ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించేందుకు వెంకటకృష్ణ ఒక ఉపాధ్యాయుడిలా మూడు నెలల పాటు మార్గదర్శకత్వం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అధికారుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సంఘాల ప్రతినిధులు కేఎస్ వరప్రసాద్, కేఎన్‌వీ ప్రసాద్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.








































