ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగా విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వైజాగ్ బే సిటీ’ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విశాఖ, అమరావతి, తిరుపతి సిటీ ఎకనమిక్ రీజియన్ల ప్రగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
వైజాగ్ బే సిటీ ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ దిగ్గజ సంస్థలను ఆహ్వానించాలని స్పష్టం చేశారు.
మూడు కీలక పిల్లర్లపై వైజాగ్ బే సిటీ
ఈ ప్రతిష్టాత్మక వైజాగ్ బే సిటీ అభివృద్ధి ప్రధానంగా మూడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. తీరప్రాంత పర్యాటకం (కోస్టల్ టూరిజం), గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, మరియు గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే ఈ మూడు ప్రధాన అంశాలకు ఇక్కడ అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
కైలాసగిరి నుంచి భీమిలి వరకు ఉన్న సుమారు 25 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, తద్వారా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి తీరప్రాంత నగరంగా (వరల్డ్ క్లాస్ కోస్టల్ సిటీ) మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే అరకు-పాడేరు-విశాఖపట్నం ప్రాంతాలను కలిపి ఒక సమగ్ర పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ఈ ఎకనమిక్ రీజియన్‌కు కొత్త ఊపు తీసుకురావాలన్నారు.
ఆరు నెలల్లో అమరావతి, తిరుపతి మాస్టర్ ప్లాన్లు
విశాఖతో పాటు అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్లను రాబోయే ఆరు నెలల కాలంలోగా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మాస్టర్ ప్లాన్ల ముసాయిదాలను ప్రజాప్రతినిధులు, ప్రజల ముందు ఉంచి వారి సలహాలు, సూచనలను సేకరించాలని తెలిపారు. ప్రతి జిల్లాకు సంబంధించిన ‘డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్స్’ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు.
అమరావతి రీజియన్ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఆక్వాకల్చర్, కోకో, పామాయిల్ సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే ఇక్కడ కొల్లేరు సరస్సును పర్యాటకంగా అద్భుతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్‌లో హార్టికల్చర్ రంగమే ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా నిలుస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుతో రాయలసీమ ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి రీజియన్‌లోని గండికోట, హార్సిలీహిల్స్, తలకోనలను అనుసంధానిస్తూ పర్యాటక సర్క్యూట్‌ను నిర్మించాలన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పోర్ట్స్ సిటీలు
రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలలో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ మూడు రీజియన్లలో అధునాతన స్పోర్ట్స్ సిటీలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌తో పాటు ఆయా రీజియన్ల ప్రత్యేక అధికారులు ముఖేష్ కుమార్ మీనా, ఎస్. సురేష్ కుమార్, ఎన్. యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.




































