ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమలలోని శ్రీవారి దివ్యక్షేత్రాన్ని తలపించేలా అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుమారు 51 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహా ప్రాజెక్టు వేగంగా కొనసాగుతోంది.
మొదటి దశ పనులను రూ.140 కోట్ల వ్యయంతో చేపట్టగా, వాటిని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాన ఆకర్షణగా 120 అడుగుల ఎత్తైన ఏడంతస్తుల మహారాజగోపురంతో పాటు ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో మరో మూడు రాజగోపురాలను నిర్మిస్తున్నారు. అదనంగా బాహ్య ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, రథ, వాహన మండపాల నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
తమిళనాడు, పల్నాడు నుంచి ప్రత్యేక రాయి
ఆలయ నిర్మాణంలో అత్యున్నత శిల్పకళకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహారాజగోపురాలు నిర్మించేందుకు అవసరమైన ప్రత్యేక రాయిని తమిళనాడులోని నామక్కల్ నుంచి తీసుకువస్తుండగా, బాహ్య ప్రాకారం నిర్మాణానికి కావాల్సిన నాణ్యమైన రాయిని పల్నాడు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తరలిస్తున్నారు. మూడు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే సుమారు 15 శాతం పనులు పూర్తయ్యాయి.
రెండో దశలో రూ.150 కోట్లతో మరిన్ని వసతులు
మొదటి దశ పూర్తైన తర్వాత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు ప్రారంభించనున్నారు. ఇందులో భక్తుల కోసం ఆడిటోరియం, అన్నదానం కాంప్లెక్స్, విశ్రాంతి భవనాలు, అర్చకులు మరియు సిబ్బంది నివాసాలు నిర్మించనున్నారు. అలాగే భారీ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పవిత్ర పుష్కరిణి కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ బృహత్ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం అమరావతిలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబించే మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.




































