ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Dy CM Pawan Kalyan Inaugurates AP Handicrafts Mahotsavam 2026 in Vijayawada

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, స్థానిక హస్తకళాకారులకు అండగా నిలవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కళావేదికలో వైభవంగా ప్రారంభమైన “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026” వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికోసం మార్కెటింగ్ పద్ధతులను మరింత మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన మార్కెటింగ్ వేదికలను కల్పించడం ద్వారానే స్థానిక కళాకారుల నైపుణ్యానికి సరైన గుర్తింపు, ఆర్థిక లబ్ధి చేకూరుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక చెక్క ఉత్పత్తులు, బొబ్బిలి వీణ వంటి సాంప్రదాయ కళలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగుతోందని, కళాకారులకు అవసరమైన ముడిసరుకు కొరత రాకుండా అటవీ విస్తరణ కార్యక్రమాలను కూడా అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను జోడించి ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించేలా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో వైవిధ్యభరితమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మరియు పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ వైభవాన్ని చాటిచెప్పే హస్తకళలను ఆధునిక మార్కెటింగ్ రంగంతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ఈ సదస్సు వేదికగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here