తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు 2,64,73,616 మంది వివరాలను మాత్రమే డిజిటైజ్ చేశారు. అంటే మొత్తం ఓటర్లలో 78.26 శాతం వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది.
మిగిలిన 73,52,832 మంది ఓటర్ల వివరాలు డిజిటైజ్ కాలేదు. వీరి పేర్లను అధికారులు ASD (Absent, Shifted, Death) జాబితాలో చేర్చారు. ఇందులో మృతి చెందినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదైనవారు, అలాగే ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు ఉండొచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాద్లోనే దాదాపు 20 లక్షల మంది
జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 19.46 లక్షల మంది ఓటర్లు ASD జాబితాలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉండగా.. 27,89,214 మంది వివరాలు మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. ఇది 58.89 శాతం.
మరోవైపు 41.11 శాతం మంది వివరాలు డిజిటైజ్ కాకపోవడంతో వారు ASD జాబితాలోకి వెళ్లారు. మేడ్చల్-మల్కాజిగిరిలో 63.97 శాతం, రంగారెడ్డిలో 65.16 శాతం డిజిటైజేషన్ పూర్తయింది.
భువనగిరి టాప్
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా అత్యధిక శాతంతో ముందంజలో ఉంది. జిల్లాలో మొత్తం 4,59,943 మంది ఓటర్లకు గాను 4,33,773 మంది వివరాల డిజిటైజేషన్ పూర్తయింది. ఇది 94.31 శాతం.
ఆ తర్వాత జనగాం 91.68 శాతం, మెదక్ 90.53 శాతం, సూర్యాపేట 90.45 శాతం, మహబూబాబాద్ 90.11 శాతంతో ఉన్నాయి.
ఓటు హక్కు శాశ్వతంగా పోయినట్టేనా?
ASD జాబితాలో పేరు ఉండటం వల్ల ఓటు హక్కు శాశ్వతంగా కోల్పోయినట్లు కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని కారణంతో అర్హత ఉన్న ఓటరును ఎలాంటి పరిశీలన లేకుండా తొలగించబోమని తెలిపారు.
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ASD జాబితాలో ఉన్న ఓటర్లకు తమ వివరాలను ధ్రువీకరించుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన గుర్తింపు పత్రాలు, ఇతర ఆధారాలను సమర్పించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వాటిని పరిశీలిస్తారు.
ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే?
ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోయినా ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్నవారు ఫారం-6 ద్వారా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివరాల్లో తప్పులు ఉంటే వాటిపై అభ్యంతరాలు, సవరణలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓకు అవసరమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి.
సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 15లోపు పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు.
అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఓటర్లు ఇప్పుడేం చేయాలి?
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే ప్రతి ఓటరూ తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. పేరు లేకపోయినా లేదా వివరాల్లో పొరపాట్లు ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
అందువల్ల ప్రస్తుతం ASD జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయినట్లు భావించాల్సిన అవసరం లేదు. తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు సంబంధిత ప్రక్రియలో అర్హత ఉన్న ఓటర్లకు తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది.








































