కూటమిలో చిచ్చు పెట్టేందుకు ఫేక్ ఖాతాలు – శ్రేణులకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి హెచ్చరిక

TDP, Janasena, BJP Alliance Alert Cadre Over Fake Social Media Accounts and Posts

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ.. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కూటమిలోని ఏదో ఒక పార్టీ అభిమానులుగా గుర్తింపు పొందినట్లు నటిస్తూ కొందరు వ్యక్తులు మిత్రపక్షాల నేతలపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారని కమిటీ పేర్కొంది. ఒక ఫేక్ ఖాతాలో టీడీపీ అభిమానులుగా కనిపిస్తూ సీఎం చంద్రబాబును పొగుడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించడం.. మరో ఖాతాలో జనసేన అభిమానుల ముసుగులో చంద్రబాబుపై విమర్శలు చేయడం వంటి చర్యల ద్వారా కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

ఇలాంటి పోస్టులను చూసి అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల రాజకీయంగా వైసీపీకే ప్రయోజనం కలుగుతుందని కమిటీ హెచ్చరించింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన సమయంలో కూటమి పార్టీల మధ్య అనవసర విభేదాలు తలెత్తడం మిత్రధర్మానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

మిత్రపక్షాల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు లేదా కక్షపూరిత ప్రచారం చేసే వారిపై పార్టీతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది. అనుమానాస్పద పోస్టులు కనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా, వాటి నిజానిజాలను పరిశీలించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.

కూటమి ఐక్యతను దెబ్బతీసే సోషల్ మీడియా ప్రచారాలకు కార్యకర్తలు బలికాకుండా సంయమనం పాటించాలని, మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here