గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసి సాగు, ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో జరిగిన ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీటిని ఎత్తిపోశారు? అందులో ఎంత నీటిని తిరిగి నదిలోకి వదిలారు? ఎంత నీటిని వినియోగించారు? ఇందుకోసం ఎంత విద్యుత్ ఖర్చయింది? అనే అంశాలపై సమగ్ర లెక్కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరంపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలి
2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఎక్కడ నీరు కనిపించినా అది కాళేశ్వరం నీళ్లేనంటూ విపక్షాలు ప్రచారం చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఎత్తిపోసిన నీరు, తిరిగి దిగువకు విడుదల చేసిన నీరు, వాస్తవంగా వినియోగించిన నీటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు.
అధికారుల వివరాల ప్రకారం ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 161.36 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అయితే వరదల కారణంగా 60 టీఎంసీలకు పైగా నీటిని తిరిగి నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ గణాంకాలను మరింత సమగ్రంగా పరిశీలించి పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఎల్లంపల్లికి వచ్చిన నీటిలో 17 టీఎంసీలను మిడ్‌మానేరుకు ఎత్తిపోశామని, మరో 20 టీఎంసీలకు పైగా నీటిని నదిలోకి విడుదల చేయాల్సి వచ్చిందని వివరించారు.
దేవాదుల నుంచి తొమ్మిది పంపులతో నీటి ఎత్తిపోత
గోదావరి జలాలను వృథా కాకుండా గరిష్ఠంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిన చిన్నచిన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తక్షణ ప్రభావం ఎదుర్కొంటున్న గ్రామాలకు పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు.
గట్టు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు
గట్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1.03 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ముందుంచాలని సూచించారు. గుడెందొడ్డి వద్ద పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీని నియమించాలని ఆదేశించారు.
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అవసరమైన ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ముందుంచాలని సూచించారు.
కాళేశ్వరం బ్యారేజీలకు డయాఫ్రం వాల్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ, దిగువ భాగాల్లో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో వివరించారు. సీకెంట్ పైల్స్‌లో లోపాలు, డిజైన్ సమస్యలు, నిర్వహణ లోపాల కారణంగా బ్యారేజీలకు సమస్యలు తలెత్తినట్లు పరీక్షల్లో తేలిందని తెలిపారు.
డయాఫ్రం వాల్ నిర్మాణం ద్వారా సీపేజీలను నియంత్రించే అవకాశం ఉందని మంత్రి వివరించగా, ఈ అంశంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA)తో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.
వరి రికార్డు ఉత్పత్తికి కాళేశ్వరం కారణం కాదు
తెలంగాణలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరడానికి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన కారణం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి వర్షాలు, సాగునీటి లభ్యత పెరగడం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్ వంటి చర్యలతో పాటు రైతు కేంద్రిత విధానాల వల్లే ధాన్యం ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు గత కొన్నేళ్లలో సుమారు 15 లక్షల కొత్త బోర్లు వేయడంతో మరో 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని సీఎం తెలిపారు.
ధాన్యం నిల్వకు ‘సైలో బ్యాగ్’లు
రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా ఉండే ఐదు జిల్లాల్లో ‘సైలో బ్యాగ్’ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. భారీ సంచుల మాదిరిగా ఉండే ఈ బ్యాగుల్లో ఒక్కోదాంట్లో సుమారు 250 టన్నుల వరకు ధాన్యాన్ని నిల్వ చేయవచ్చు.
నీరు, కాంతి లోపలికి చొరబడకుండా ప్రత్యేక ప్లాస్టిక్ పాలిమర్లతో వీటిని తయారు చేస్తారు. దీంతో ధాన్యం తడవడం, పురుగులు పట్టడం, పాడవడం వంటి సమస్యలను తగ్గించవచ్చు. సాధారణ గోదాములతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో రైతులకు, ప్రభుత్వం నిర్వహించే ధాన్యం నిల్వ వ్యవస్థకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.




































