ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రూ. 4,592 కోట్ల అంచనా వ్యయంతో 2,200 ఎకరాల్లో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ఒక చారిత్రాత్మక మైలురాయిని దాటింది. విమానాశ్రయానికి సంబంధించి 3.8 కిలోమీటర్ల పొడవైన సువిశాల రన్‌వేపై తొలి ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది.
ఈ నేపథ్యంలో తాజాగా నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు.
విశాఖ నుండి ప్రతి 30 నిమిషాలకు ఒక ఏసీ బస్సు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విమాన ప్రయాణికులకు ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘ఏరో ఎక్స్‌ప్రెస్’ ఎలక్ట్రిక్ ఏసీ (EV AC) బస్సు సర్వీసులు ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేయనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
మొత్తం 20 అత్యాధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను విశాఖపట్నంలోని ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు ముఖ్యమైన మార్గాల్లో నడుపుతున్నారు. ఈ బస్సుల్లో లగేజీకి ప్రత్యేక స్థలం, సీసీటీవీ కెమెరాలు మరియు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ వీల్ చైర్ లిఫ్ట్ సదుపాయాలను కల్పించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం రెండు రూట్లను కేటాయించారు..
-
రూట్ 1 (ASR-1): గాజువాక నుంచి ప్రారంభమై ఎన్ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం మరియు మధురవాడ మీదుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటుంది.
-
రూట్ 2 (ASR-2): సింధియా, విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బీచ్ రోడ్, ఐటీ హిల్స్ మరియు మారికవలస మీదుగా విమానాశ్రయానికి వెళుతుంది.
టికెట్ ఛార్జీల విషయానికొస్తే ప్రైవేటు టాక్సీలతో పోలిస్తే ఇవి చాలా అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ. 300, గాజువాక నుంచి రూ. 400 కాగా, మధురవాడ పరిసరాల నుంచి ప్రయాణించే వారికి కేవలం రూ. 100 ఛార్జీ నిర్ణయించారు.
ఎయిర్‌పోర్టు విశేషాలు
జీఎంఆర్ గ్రూప్ (GVIAL) ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (జేవీ/పీపీపీ) నమూనాలో సైక్లోన్ల ప్రభావంతో గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఈదురుగాలులను కూడా తట్టుకునేలా అత్యాధునిక హంగులతో, ఏటా 20,000 టన్నుల సరకు రవాణా (కార్గో) మరియు రోజుకు 200 విమానాల నిర్వహణ సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్టును రూపొందించారు.
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విశాఖతో పాటు ఉత్తరాంధ్ర, పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల పర్యాటకం, పరిశ్రమలు, స్థిరాస్తి మరియు ఫార్మా-ఆక్వా ఎగుమతుల రంగాలు వేగంగా పుంజుకోనున్నాయి. రన్ వే, నావిగేషన్ వ్యవస్థల పరీక్ష విజయం సాధించడంతో రాబోయే కొద్ది నెలల్లోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించి, వ్యాపార విమానాల రాకపోకలను అందుబాటులోకి తేవడానికి వేగంగా కసరత్తు జరుగుతోంది.







































