మంత్రి పదవి నుంచి తొలగించిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీ రావాలంటూ పిలుపు అందింది. వెంటనే దేశ రాజధానికి రావాలని పార్టీ పెద్దలు ఆమెకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం కొండా సురేఖతో స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె కుమార్తె సుస్మిత పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆమెను వివరణ కోరగా.. కొండా సురేఖ రెండు లేఖల ద్వారా తన వివరణను సమర్పించారు.
ఆమె వివరణను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడికి అందించింది. అనంతరం ఆ నివేదిక అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో కొండా సురేఖపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. కొండా సురేఖ ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టు కూడా ఇటీవల వైరల్‌గా మారింది. ‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ ఆమె పేరుతో వచ్చిన పోస్టుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పోస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.
మంత్రి పదవి కోల్పోయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాలని కొండా సురేఖకు పిలుపు రావడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు కేబినెట్ హోదాతో సమానమైన మరో పదవి లేదా కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








































