ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీ కార్యాచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.11,085 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ చూపించారు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చురుగ్గా పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. “పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ చూపించారు” అని కితాబిచ్చారు. కేంద్ర పథకాలను సమర్థంగా ఫాలోఅప్ చేస్తూ గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సఫలమయ్యారని కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్‌వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే పల్లె పండుగ ఉద్దేశమని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం
రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటలను ప్రోత్సహించడంతో పాటు పాడి రైతులకు మినీ గోకులాల ద్వారా అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, గ్రామాల పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు.
గత వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి వేసిన ఓటుకు తగిన ఫలితాలు అందుతున్నాయని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించాలి
రాబోయే పంచాయతీ ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు కనిపిస్తోందని, దీనిని సమర్ధవంతంగా వినియోగించుకుని ఘనవిజయం సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను రాష్ట్రానికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటి నిధులు మరియు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
కాగా, పల్లె పండుగ 3.0లో భాగంగా గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, పాడి పరిశ్రమ, ఉద్యానవన రంగం, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మొత్తం రూ.11,085 కోట్లలో కేంద్రం వాటా రూ.5,391 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లను సమకూర్చనుంది. 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22,000 మినీ గోకులాలు, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే 50 వేల ఎకరాల్లో ఉద్యానవన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.









































