ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా బరిలో ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్స్‌గా బరిలో నిలిచే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి నామినేషన్లు వేసిన వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని, కూటమి అధికారిక అభ్యర్థుల విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వతంత్రులుగా లేదా రెబల్స్‌గా పోటీ చేయడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని సీఎం తేల్చిచెప్పారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ, ప్రతి నియోజకవర్గంలోనూ సమన్వయంతో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని పేర్కొన్నారు. సోషల్ రీఇంజినీరింగ్ విధానంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అత్యుత్తమ అభ్యర్థులను ఎంపిక చేశామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయం కంటే మెరుగైన ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సాధించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను, విధ్వంసాలను ప్రజలకు వివరించాలని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, సుపరిపాలన ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి క్రమశిక్షణ తప్పే వారిపై కఠినమైన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
మొత్తానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరందుకున్న ఈ తరుణంలో.. టీడీపీ అధినేత రెబల్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం పార్టీ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని కార్యకర్తలకు తేల్చిచెప్పినట్టయింది.








































