ఆంధ్రప్రదేశ్ లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలకు 90 శాతంపైగా స్ట్రైక్‌రేట్ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం (నవంబర్ 21) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఈ ఫలితాలు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతు అని స్పష్టం చేశారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ లేదా బ్యాలెట్ పేపర్—ఏ పద్ధతిలో ఎన్నికలు జరిగినా కూటమిదే విజయమని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు 2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం తగ్గిందని తెలిపారు.
కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియపై తాను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టానని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి స్థానంలో కూటమి అభ్యర్థులే గెలవాలని అందరం కోరుకున్నామని చెప్పారు. ప్రతిచోటా కూటమి గెలిచినప్పుడే కూటమి మరింత పటిష్ఠంగా నిలుస్తుందనేది తన అభిప్రాయమని వివరించారు.
అభ్యర్థుల ఎంపికపై పెద్దఎత్తున కసరత్తు చేశామని, స్థానిక సంస్థల్లో సామాజిక న్యాయం సాధించేందుకు ప్రయత్నించామని ముఖ్యమంత్రి తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతలు, ప్రవర్తన, పార్టీ పట్ల అంకితభావం, విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, తమ వద్ద ఉన్న డేటా ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు.
“కార్యకర్తే అధినేత… కార్యకర్త లేకపోతే నాయకులు లేరు” అని స్పష్టం చేసిన చంద్రబాబు, బీసీలు ఎప్పటినుంచో టీడీపీకి అండగా ఉన్నారని, కష్టకాలంలోనూ పార్టీకి తోడుగా నిలిచారని కొనియాడారు.
బీసీలకు ఎప్పటినుంచో రాజ్యాధికారంలో ప్రాధాన్యం ఇస్తున్నామని, జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించామని సీఎం పేర్కొన్నారు. అందుకే ఒక ఎంపీటీసీ స్థాయి కార్యకర్తను ఎంపీగా చేశామని గుర్తుచేశారు.
పల్నాడులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఎన్టీఆర్ జిల్లాలో జనరల్ స్థానంలో ఎస్సీ మహిళను పోటీకి నిలిపి జడ్పీ ఛైర్మన్ పదవి ఇచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన కోట పుల్లమ్మ ఎంటెక్ చదువుకున్నారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వస్తే వైఎస్ జగన్ అండ్ కో అడ్డుపడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమపై మొత్తం 63 కేసులు వేసి స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో హింసకు పాల్పడాలని చూశారని, మొదటి రోజు హింసను ప్రేరేపించింది వైసీపీ నేతలేనని దుయ్యబట్టారు. ప్రతిపక్షం పన్నిన కుట్రలు, హింసాత్మక ప్రయత్నాలన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారని కొనియాడారు.
తుపాను సమయంలో కూడా కూటమిపై విశ్వాసంతో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారని ప్రశంసించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించిందని, ఇప్పుడు వ్యవస్థలన్నీ గాడిలో పడుతున్నాయని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నట్లు రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని, ఇందుకు ప్రజలు ఇచ్చిన తీర్పే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.





































