ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం తిరుమలకు చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తిరుమల క్షేత్ర ఆచారాన్ని అనుసరిస్తూ, శ్రీవారి దర్శనానికి ముందు అన్నా లెజినోవా శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనం పూర్తయ్యాక రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి, బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నా లెజినోవా ఈ తిరుమల యాత్ర చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అలిపిరి నడకమార్గం ద్వారా ఎలాంటి ప్రత్యేక హంగులు లేకుండా సాధారణ భక్తురాలిలా దాదాపు నాలుగు గంటల పాటు కాలినడకన కొండపైకి చేరుకున్నారు.
విదేశీ మూలాలు కలిగినప్పటికీ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల ఆమె చూపించిన గౌరవం పలువురి ప్రశంసలను అందుకుంది. సాధారణ భక్తురాలిలా నడకమార్గంలో తిరుమలకు చేరుకోవడం, ఆలయ సంప్రదాయాలను పాటించడం వంటి అంశాలు అక్కడి భక్తులను ఆకట్టుకోగా, సోషల్ మీడియా వేదికలపై కూడా ఆమె నిరాడంబరతపై నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంది.



































