దేశ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసిన నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu Praises Nirmala Sitharaman For Banking Reforms

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేవలను ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన మెగా ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ (రుణాల పంపిణీ) కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు.

దేశంలో బ్యాంకింగ్ రంగం గతంతో పోలిస్తే ఎంతో పారదర్శకంగా, ప్రజలకు మరింత చేరువగా మారిందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, నిర్మలా సీతారామన్ నాయకత్వంలో అమలైన విధానాల ఫలితంగానే బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ భారం ఉండేదని, అయితే కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన చర్యల వల్ల వడ్డీ రేట్లు 12–13 శాతం నుంచి 8–9 శాతానికి తగ్గే అవకాశం లభించిందని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రతి ఏడాది సుమారు రూ.1,530 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు రుణాల కోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు బ్యాంకులే ప్రజల వద్దకు చేరుకుని అవసరమైన రుణాలు అందించే స్థాయికి వ్యవస్థ మారిందని చెప్పారు.

నరసరావుపేటలో నిర్వహించిన మెగా రుణ మేళా ద్వారా వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), మహిళా స్వయం సహాయక సంఘాలకు కలిపి రూ.3,216 కోట్ల రుణాలు పంపిణీ చేయడం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక స్వావలంబన పెరిగి, పేదరిక నిర్మూలనకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు కేవలం ఆర్థిక సంస్థలుగానే కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, అలాగే పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసి దేశానికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here